తమిళసినిమా: నటుడు విజయ్‌కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. విజయ్ నటించిన సర్కార్ చిత్ర పోస్టర్ ఆయన్ను సమస్యల్లో పడేస్తోంది. సర్కార్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్ సిగరెట్ కాలుస్తున్నట్లు ఉంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే పీఎంకే నేతలు రాందాస్, అన్భుమణి రాందాస్ తదితరులు విమర్శల దాడి చేశారు. తాజాగా స్థానిక కోడంబాక్కంకు చెందిన ఎస్.శిరిల్ సర్కార్ పోస్టర్ వ్యవహారంపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను తమిళనాడు పొగనిరోధక సంఘంలో సభ్యుడినని తెలిపారు.
దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు పొగతాగడానికి బానిసలవుతున్నారన్నారు. వారిలో ఏడాదికి లక్ష మంది వరకూ మృత్యవాత పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పొగాకు సంబంధించిన సిగరెట్లు వంటి ప్రకటనలను ప్రభుత్వం నిషేధిస్తూ 2011లో ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అదే విధంగా సినిమా, సీరియళ్లలో సిగరెట్లు తాగే సన్ని వేశాలు పొందుపరచరాదని నిబంధనలను విధించిందని గుర్తుచేశారు. ఇటీవల నటుడు విజయ్ నటిస్తున్న సర్కార్ చిత్ర పోస్టర్లలో ఆయన సిగరెట్ తాగుతున్న దృశ్యం చోటుచేసుకుందన్నారు. ఆ పోస్టర్లను తమిళనాడులో అన్ని థియేటర్ల వద్ద ఏర్పాటు చేశారన్నారు. ఇవి పొగ నిషేధ ప్రకటనలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు 1987లో ప్రవేశ పెట్టిన నిబంధనల ప్రకారం ఈ పోస్టర్లు ధ్రువపత్రాన్ని పొందలేదన్నారు.
తారలను అనుసరించే ప్రమాదం..
సినీ తారలను అభిమానులు అమితంగా ఆరాధిస్తారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకునే అభిమానులు విజయ్ లాంటి స్టార్ నటుడు సిగరెట్లు తాగుతున్నట్లు చూపిస్తే వారు దాన్ని అనుసరిస్తారన్నారు. సర్కార్ చిత్ర పోస్టర్ల వ్యవహారంలో ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, చిత్ర నిర్మాతలపై తగినచర్యలు తీసుకునేలా రాష్ట్ర ఆరోగ్యశాఖకు, పర్యవేక్షణ సమితికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేన్సర్ బాధితుల సంరక్షణ కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేసి నటుడు జోసఫ్ విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగదాస్, చిత్ర నిర్మాతల నుంచి తలా రూ.10 కోట్లు నష్ట పరిహారాన్ని వసూలు చేయాలన్నారు.ఆ నిధిని స్థానిక రాయపేటలోని ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి అభివృద్ధికి వినియోగించాలన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారించిన న్యాయమూర్తులు ఇందిరా బెనర్జి, పీటీ ఆషా పిటిషన్‌పై 2 వారాల్లోగా బదులివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, నటుడు విజయ్, దర్శకుడు ఏఆర్.మురుగుదాస్, నిర్మాణ సంస్ధలకు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment