ఆయన సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ - శ్రీను వైట్ల
సాగర్‌గారి దగ్గర నేను సహాయ దర్శకునిగా చేస్తున్నప్పుడు నారాయణగారు రచయితగా చేసేవారు. అప్పట్నుంచే మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ‘నువ్వు పెద్ద డెరైక్టర్ అవుతావు’ అని ప్రోత్సహించేవారు. ఆయనకు విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. మేం ఇద్దరం మంచి మిత్రులు కావడానికి ఒక రకంగా అదే కారణం. నా తొలి చిత్రం ‘ఆనందం’ నుంచి ఇప్పటివరకు ఒకటీ, రెండు సినిమాల్లో మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ ఆయన నటించారు.
ఆ ఒకటి, రెండు చిత్రాలు కూడా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నటించలేకపోయారు. ఆయన మంచి టైమింగ్ ఉన్న నటుడు. ఏ పాత్ర ఇచ్చినా దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లగలిగిన ప్రతిభావంతుడు. హార్డ్ వర్కర్ కూడా. అందుకు నిదర్శనం ‘దూకుడు’ సినిమా. అందులో ఇతర చిత్రాల హీరోలను ఎమ్మెస్‌గారు పేరడీ చేసే సన్నివేశాలున్నాయి కదా. వాటిని ఒకే రోజులో చేసేశారాయన. అన్ని గెటప్స్ మార్చుకుని ఒకే రోజులో చేయడం సులువు కాదు. సూపర్బ్ ఎనర్జీ ఉన్న నటుడు. ఆయన్ని కోల్పోవడం బాధాకరం.