ఆ ముగ్గురి కల ఒక్కటే..!
ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన సౌత్ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ సినీ సెలబ్రిటీగా మారిన అతడు ఆ చిత్రం కన్నా భారీగా మహా భారతాన్ని తెరకెక్కిస్తానంటూ ప్రకటించాడు. అయితే ఆ సినిమా రూపొందించే స్థాయి, పరిజ్ఞానం తనకింకా రాలేదన్న జక్కన్న ఏ రోజుకైనా మహాభారతానికి దృశ్యరూపం ఇవ్వటమే తన కల అంటూ ప్రకటించాడు.
తాజాగా బాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. కొరియోగ్రాఫర్గా సత్తా చాటి ఇప్పుడు దర్శకుడిగా హవా చూపిస్తున్న ప్రభుదేవా, ఎప్పటికైన మహాభారతాన్ని తన దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అది కూడా హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ స్థాయిలో భారీగా తెరకెక్కించడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఇక దర్శకరత్న దాసరి కూడా మహాభారతానికి దృశ్యరూపం ఇవ్వాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయప సరైన సమయంలో మరోసారి మెగాఫోన్ పట్టి మహాభారత పౌరాణిక గాథను తనదైన స్టైల్లో వెండితెర మీద ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా మహాభారతాన్ని మొదలు పెడతారో చూడాలి.