లాస్‌ఎంజెల్స్: హాలీవుడ్ పేరు మారింది. అది కూడా నూతన సంవత్సరం రోజే.. ఇది చూసినవాళ్లంతా కూడా అవాక్కయ్యారు. రాత్రికి రాత్రి ఇలా ఎలా సాధ్యం అయిందని ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందంటే లాస్ ఎంజెల్స్ వెళ్లినవారందరికీ తొలుత దర్శనం ఇచ్చేది హాలీవుడ్ అంటూ పెద్ద సైన్ బోర్డు. హాలీవుడ్ స్టూడియోకి స్వాగతం పలుకుతూ అది కనిపిస్తుంటుంది. అయితే, నూతన సంవత్సరం రోజున తెల్లవారిన తర్వాత లాస్ ఎంజెల్స్ ప్రజలు, స్టూడియో వాళ్లు ఒక్కసారిగా ఆ బోర్డు వైపు చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ బోర్డు పేరు కాస్త హాలీవీడ్‌గా మారిపోయింది.
ఓ అనే ఆంగ్ల అక్షరం ఉండాల్సిన చోట్ల ఈ అనే అక్షరాలు వచ్చిచేరాయి. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ప్రకారం ఓ వ్యక్తి కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత అర్ధరాత్రి రెండుగంటల ప్రాంతంలో ఆ అక్షరాలను ఓ ఆకతాయి మారుస్తున్నట్లు రికార్డయింది. అయితే, పోలీసులు మాత్రం అసలు ఇది ఎలా సాధ్యం అయిందో అర్ధం కావడం లేదని, అప్పుడు జోరు వాన, పైగా చీకటి ఉందని ఆ సమయంలో ఆ వ్యక్తి అలా చేశాడో తెలియడం లేదని అంటున్నారు.
ఆదివారం ఉదయం 11గంటల వరకు కూడా హాలీవుడ్ అనే పేరు హాలీవీడ్‌గానే ప్రజలకు దర్శనం ఇచ్చింది. ఈ పేరును మార్చడానికి ఆ వ్యక్తి నల్లటి టార్పాన్లను ఉపయోగించాడు. అయితే, ఈ పేరులోని కొన్ని అక్షరాల్లో కొన్ని చోట్ల సెన్సార్లు ఉన్నాయని, వాటిని తాకగానే పోలీసులకు అలారం వెళుతుందని, కానీ మార్చిన వ్యక్తి మాత్రం సెన్సార్లను తాకి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.