మహేశ్ ఏది ఫీలైతే... అదే చెబుతాడు!
సుధీర్‌బాబు... హీరో కృష్ణ గారి అల్లుడు. మహేశ్‌బాబుకు బావ. క్రీడాకారుడిగా మొదలై కథానాయకుడిగా వెండితెర మీదకు నడిచొచ్చారు. సినిమా వెంట సినిమాగా ఒక్కో మెట్టూ పెకైక్కుతూ వస్తున్న సుధీర్‌బాబు ‘ప్రేమకథా చిత్రమ్’ నుంచి ఇటీవలి ‘మోసగాళ్ళకు మోసగాడు’ దాకా ప్రేక్షకులకు సుపరిచితులు. తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ సినిమాతో ఈ శుక్రవారం జనం ముందుకొస్తున్న సుధీర్‌తో కాసేపు...
** కృష్ణగారు, మహేశ్‌బాబు మీకు మంచి కేరాఫ్ అడ్రస్‌లా, సినిమా రంగంలోకి రావడానికి విజిటింగ్ కార్డ్‌లా ఉపయోగపడ్డారనుకోవచ్చా?
అడ్రస్, విజిటింగ్ కార్డ్ సంగతి పక్కన పెడితే, నేను మైనస్‌తో నా కెరీర్ మొదలుపెట్టాను. హీరో కావాలనుకున్న తర్వాత అవకాశాల కోసం రెండేళ్లు తెగ తిరిగాను. ‘కృష్ణ గారి అల్లుణ్ణి, మహేశ్ బావను’ అని చెప్పుకుని అవకాశాలు తెచ్చుకోవాలనుకోలేదు. వాస్తవానికి నా మొదటి సినిమాకు నేనే డబ్బులు పెట్టాను. ‘కృష్ణగారి అల్లుడట, మహేశ్‌బాబు బావ అట..’ అని అభిమానులు థియేటర్‌కు వచ్చారు. ఆ అభిమానం నాకు ప్లస్ అయ్యింది. అవకాశాలు తెచ్చుకోవడానికీ, నిలదొక్కువడానికీ నా కష్టమే నాకు ఉపయోగపడింది.
** బయటి హీరోలకు మహేశ్ నుంచి గట్టి పోటీ ఉంది! మీకేమో ఇంటి నుంచే పోటీ ఉంది?
మహేశ్‌ది వేరే ట్రాక్. నాది వేరే ట్రాక్. నేను అప్ కమింగ్ హీరో. కొంచెం గుర్తింపు తెచ్చుకుని, ఇలా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు 20, 30 మంది హీరోలున్నారు. పోటీ బలంగానే ఉంది. తట్టుకోవడానికి ఎంత కష్టపడాలో అంతా పడతాను.
** మామూలుగా మీరు యాక్ట్ చేసే ఏ సినిమానైనా మహేశ్‌బాబు చూస్తారేమో! మరి.. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చూశారా?
ఇంకా చూడలేదు. నేను యాక్ట్ చేసే ప్రతి సినిమా మహేశ్ చూస్తాడని చెప్పలేం. టైమ్ కుదిరితే మాత్రం తప్పకుండా చూస్తాడు.
** మహేశ్ తన చెల్లెలు ప్రియదర్శిని (సుధీర్‌బాబు భార్య) సంతృప్తి కోసం మీ సినిమాలు బాగుంటాయంటారా, లేక నిజంగా నచ్చితేనే?
ముఖస్తుతి కోసం, ఒకరిని సంతృప్తిపరచడం కోసం నా సినిమాలు బాగున్నాయని మహేశ్‌బాబు చెప్పడు. నిజంగా నచ్చితే అప్పుడు ఎవరూ అడగకుండానే చెబుతారు. ఒకవేళ నచ్చకపోతే మాత్రం మా మామగారు (సూపర్ స్టార్ కృష్ణ) నచ్చిందని చెప్పమన్నా చెప్పడు. లోపల ఏది ఫీలైతే అదే బయటకు చెబుతాడు.
** ప్రస్తుతం చేసిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం గురించి ఏం చెబుతారు?
ఇది కన్నడ చిత్రం ‘చార్మినార్’కు రీమేక్. ఈ రీమేక్‌కి లగడపాటి శ్రీధర్ నన్ను హీరోగా తీసుకోవడం నాకు ఆనందంగా ఉంది. సినిమా మీద అపారమైన ప్రేమ, మంచి సినిమా తీయాలనే తపన ఉన్న వ్యక్తి శ్రీధర్. ‘చార్మినార్’ గురించి చెప్పగానే, నేనా సినిమా చూడననీ, కథ చెప్పమనీ అడిగాను. కథ నాకు బాగా నచ్చి, ఒప్పుకున్నాను. కన్నడంలో తీసిన చంద్రు దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపొందింది.
** ఈ కథలో మీకు సవాల్ అనిపించినదేంటి?
పదహారేళ్ల కుర్రాడిగా, ఇరవై రెండేళ్ల యువకుడిగా, ముప్ఫయ్యేళ్ల వ్యక్తిగా నటించాను. టీనేజ్ కుర్రాడిగా కనిపించడం కోసం కొంచెం బరువు తగ్గాను. ఆ వయసులో అమాయకంగా కనిపించాలి కదా... అందుకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాను. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రం ఇది.
** ఈ చిత్రంలో మీ అబ్బాయి నటించాడట?
లేదు. శ్రీధర్‌గారబ్బాయి యాక్ట్ చేశాడు. మావాడు ‘మోసగాళ్లకు మోసగాడు’లో చేశాడు. ఇప్పుడు నాని సినిమాలో చేస్తున్నాడు.
** మీ అబ్బాయి పేరేంటి? పిల్లాణ్ణి కూడా హీరోని చేయాలనుకుంటున్నారా?
(నవ్వుతూ...) మా వాడి పేరు చర్విత్ మానస్. వాడికి ఏడేళ్లు. యాక్టింగ్ అంటే చాలా ఇంట్రస్ట్. నన్ను చూసి, జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు. వాడు చేసేవి నేను కూడా చేయలేను. వాళ్ల మామయ్య (మహేశ్) సినిమాలు చూస్తుంటాడు. బహుశా యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ కలగడానికి వాళ్ళ మేనమామ మహేశే ఇన్‌స్పిరేషన్ ఏమో!
** ఇంతకీ మీరు మీ మామయ్య కృష్ణగారితో ఎప్పుడు నటిస్తారు?
మంచి కథ కుదిరితే నాకు నటించాలనే ఉంది. ఎందుకంటే, మా కుటుంబంలో రమేశ్‌బాబు, మహేశ్, నా భార్య ప్రియదర్శిని, మంజుల, ఆమె భర్త సంజయ్... ఇలా అందరికీ మామయ్యగారితో కలిసి నటించే అవకాశం దక్కింది. నాక్కూడా ఓ చాన్స్ వస్తే ఆనందిస్తా.
** మీ ఆవిడ యాక్ట్ చేశారా? ఎప్పుడు?
చిన్నప్పుడు మామయ్యగారి సినిమాల్లో నటించింది.
** మీ తదుపరి చిత్రాల సంగతులేమిటి?
నూతన దర్శకుడు శ్రీరామ్‌తో ఓ సినిమా చేస్తున్నా. దీనికి వర్కింగ్ టైటిల్‌గా ‘భలే మంచి రోజు’ అనుకుంటున్నాం. హిందీ చిత్రం ‘భాగీ’లో నటిస్తున్నా. ఇది ఏ సినిమాకీ రీమేక్ కాదు. ఓ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. నేను, టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నాం.