హారర్ చిత్రంగా రమ్
కోలీవుడ్‌లో హారర్ కథా చిత్రాలకు ఆదరణ ఏ మాత్రం కొరవడలేదనడానికి నిదర్శనం ఆ తరహా చిత్రాల నిర్మాణాలు ఎక్కువ కావడమే. తాజాగా రమ్ అనే చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంతకు ముందు మసాలాపడమ్ చిత్రాన్ని అందించిన ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ అధినేత టి.విజయరాఘవేంద్ర నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. నవ దర్శకుడు సాయ్‌భరత్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో హృషికేష్, సంచితశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మియా, అంజత్‌ఖాన్, అర్జున్ చిదంబరం ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హాస్య నటుడు వివేక్, అంజాదే చిత్రం ఫేమ్ నరేన్ కీలక పాత్రలు పోషించనున్నారు.
ఈ సందర్భంగా చిత్రం వివరాలను నిర్మాత విజయరాఘవేంద్ర తెలుపుతూ చిత్రంలో హీరోగా నటిస్తున్న హృషికేష్ తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఈ కథ వినగానే నో అని చెప్పలేకపోయానన్నారు.అంత సంతృప్తి కలిగించడంతో వెంటనే షూటింగ్ మొదలెట్టేద్దాం అని చెప్పానన్నారు. హారర్ క్రైమ్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్ర కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుందన్నారు. ప్రముఖ హాస్యనటుడు వివేక్ నటిస్తున్న తొలి హారర్ చిత్రం ఇదే కావడం విశేషం అన్నారు. అదే విధంగా నటుడు నరేన్ చాలా వైవిధ్యపాత్రలో కనిపించనున్నారని చెప్పారు.
వేదాళం, నానుమ్ రౌడీదాన్, తంగమగన్ వంటి వరుస విజయాలు సాధించిన యువ సంగీత దర్శకుడు అనిరుద్ తమ చిత్రానికి సంగీత భాణీలు కట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇది యూత్ టీమ్ రూపొందిస్తున్న చిత్రం అని కచ్చితంగా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగించే చిత్రంగా రమ్ ఉంటుందని అన్నారు.