కుటుంబంతోనే హాయిగా ఉంది
మరోసారి వెండితెరపై కనిపించే ఆలోచనేదీ ప్రస్తుతానికి లేదని బాలీవుడ్, టాలీవుడ్ నటి సోనాలీ బింద్రే పేర్కొన్నారు. ప్రస్తుతానికి అంగీకరించిన టీవీ కార్యక్రమాలతోనే సంతోషంగా ఉన్నానని, తద్వారా కుటుంబానికి అధిక సమయమివ్వగలుగుతున్నానని తెలిపారు. తన ఎనిమిదేళ్ల కొడుకు రణవీర్ ఎదుగుదలే తనకు ముఖ్యమని చెప్పారు. సినిమాల్లో నటించేందుకు అనేక అవకాశాలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతానికి కుటుంబమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. జీవితంలోని ప్రతి దశతో మనమూ మార్పు చెందాలని ఈ 39 ఏళ్ల నటి వేదాంత ధోరణిలో అభిప్రాయపడ్డారు. అమ్మతనం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని చెప్పారు. కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న ‘మిషన్ సప్నే’ కార్యక్రమానికి సోనాలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
వివిధ రంగాలకు చెందిన పది మంది సెలబ్రిటీలు సామాన్యులుగా అవతారమెత్తి, వారి వృత్తులను చేపట్టి దినసరి వేతనాన్ని ఆర్జించడమే ఈ కార్యక్రమం ఇతివృత్తమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందెన్నడూ చేయలేదని, అందువల్ల ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. మిషన్ సప్నే కార్యక్రమం ఈ నెల 27 నుంచి ప్రసారం కానుంది. సల్మాన్‌ఖాన్, రణబీర్ కపూర్, కరణ్‌జోహార్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలు తమ నిజ జీవితంలో క్షురకునిగా, వడాపావ్ విక్రేతగా, ఫొటోగ్రాఫర్‌గా, కూరగాయల విక్రేతగా కనిపించనున్నారు. దినసరి వేతనాన్ని ఆర్జించే వారిగా సెలబ్రిటీలు ఒకరోజు కష్టపడటం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుందని సోనాలీ చెప్పారు.