
బాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు త్వరలోనే దర్శకత్వ శాఖలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. సినిమాలు, దర్శకత్వం మాత్రమే కాదు త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు తాను వెనుకాడబోనని ఆమె స్పష్టం చేశారు.
కంగనా ఇటీవల ముంబైలో జరిగిన ప్లాటినమ్ వోగ్ ఆవిష్కరణ వేడుకలో పాల్గొన్నారు. షోస్టాపర్‌గా ఈ కార్యక్రమంలో ర్యాంప్‌వాక్ చేసిన కంగనా ఈ సందర్భంగా సరదాగా మీడియాతో ముచ్చటించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖమేనా అని ఈ అడగ్గా.. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే వయస్సు తనకు రాలేదని, అంత రాజకీయ జ్ఞానం కూడా తనకు లేదని పేర్కొన్నారు. అయితే, సమయం వస్తే దేశం కోసం ఏం చేసేందుకైనా వెనుకాడబోనని ఆమె అన్నారు. ‘దేశానికి ఏదైనా ఆపద వస్తే.. ప్రాణాలు అర్పించైనా రక్షించేందుకు సైనికులు సదా సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా దేశానికి నా అవసరం వస్తే.. రాజకీయాల్లోకి రావడమే కాదు.. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధంగా ఉంటాను’ అని ఆమె అన్నారు. అంతకుముందు ఓ కార్యక్రమం ప్రధాని మోదీని కంగనా ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగిన నాయకుడు ఆయన అని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment