'ఆ సీన్లు తెలివైనవారికే అర్థమవుతాయి'
ముంబయి: సంబంధబాంధవ్యాల విషయంలో తాను పక్కా సాంప్రదాయవాదిలా ఉంటానని ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ చెప్పాడు. సంబంధాల విషయంలో తరాల వ్యత్యాసం ఉందని అన్నాడు. రోమాంటిక్ రిలేషన్ కు చాలా పొరలు ఉంటాయని, దేనికి కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని జోడించి చెప్పకూడదని, అలాగే రహస్యంగా ఉంచకూడదని అభిప్రాయపడ్డాడు. తాను సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉన్న రోజుల్లో పెరిగి పెద్దవాడినయ్యానని, సాంప్రదాయవాదినని తెలిపాడు. దీపికా పదుకొనె, వాణి కపూర్ వంటి బాలీవుడ్ నటీమణులతో వెండితెరపై రణ్ వీర్ ఎలాంటి రోమాన్స్ పండించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక బేఫికర్ సినిమాలో అయితే, అది కాస్త పదింతలు ఉండనుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ చిత్ర విశేషాలు తెలియజేస్తూ తాను, వాణికపూర్ నటించి బేఫికర్ చిత్రం నేటి యువతరం ఆలోచనలు ప్రతిబింబించేలా ఉంటుందని చెప్పాడు. ముద్దు సన్నివేశాల గురించి ప్రశ్నించగా.. ప్రతి ఒక ముద్దులో ప్రేమను వ్యక్తంపరచడం ఉంటుందని, తెలివైనవారే వాటిని అర్ధం చేసుకుంటారని, తప్పుగా అనుకోరని అన్నాడు. ఈ సినిమాలో పలు రకాల ముద్దు సన్నివేశాలు ఉన్నాయని, వాటిని చూశాక ఏ ఒక్కరు విమర్శించబోరని అభిప్రాయపడ్డాడు. వాణి కపూర్ మంచి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నటి అని, స్వీట్ గర్ల్ అని చెప్పాడు. వాణి కపూర్ మాట్లాడుతూ తాను రిలేషన్ ల విషయంలో చాలా సాధారణంగా ఉంటానని, ఎదుటి వారి నుంచి ఎలాంటిది ఆశించకుండా ఉంటానని తెలిపింది.