బన్నీతో నాకు అంత చనువుంది! - సురేందర్‌రెడ్డి
‘‘బన్నీకి ఈ టైటిల్ యాప్ట్... ఈ కథ యాప్ట్... టోటల్‌గా ఈ సినిమా యాప్ట్’’ అంటున్నారు సురేందర్‌రెడ్డి. మాస్ సినిమాని కూడా క్లాస్‌గా, స్టయిలిష్‌గా తెరకెక్కించే సురేందర్‌రెడ్డి, బన్నీని ‘రేసుగుర్రం'గా తీర్చిదిద్దారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చి, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సురేందర్‌రెడ్డి చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆయనతో జరిపిన సంభాషణ ఈ విధంగా...
‘రేసుగుర్రం' అంటున్నారు... హీరో బైక్ రేసరా? హార్స్ రైడరా?
ఈ రెండూ కాదు. రేసు గుర్రం అంత వేగంగా హీరో పాత్ర ఉంటుంది. సినిమా కూడా చాలా స్పీడ్‌గా సాగుతుంది.
ఇంతకీ హీరో ఏం చేస్తాడు?
ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే సాధించేవరకూ నిద్రపోడు. సినిమా మొత్తంలో హీరోకి రెండు, మూడు లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి ఏం చేశాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ కథ బన్నీని దృష్టిలో పెట్టుకునే తయారు చేశారా?
అవును. బన్నీకి వంద శాతం నప్పే కథ ఇది. టైటిల్ మాత్రం షూటింగ్ సగంలో ఉన్నప్పుడు అనుకున్నాం. బన్నీ ఎంత ఎనర్జిటిక్కో మరోసారి ఈ సినిమాలో చూస్తారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కోపం వచ్చినప్పుడు తిట్టడం, బాధ అనిపించినప్పుడు అలగడం.. ఇలా నా ఫీలింగ్ ఏదైనాసరే నేను నిర్భయంగా వ్యక్తపరచగల చనువు నాకు బన్నీ దగ్గర ఉంది. అతను అంత కంఫర్టబుల్.
‘రేసు గుర్రం’ కథ ఏంటి?
భిన్న మనస్తత్వాలున్న ఇద్దరు అన్నదమ్ముల కథ. టామ్ అండ్ జెర్రీ తరహా అన్నమాట. అన్న శ్యామ్. తమ్ముడు బన్నీ. చదివే పుస్తకాల్లో ఏది ఉంటే దాన్ని అనుసరించడం అన్న స్టయిల్. కానీ, తన మనసుకి ఏది అనిపిస్తే అది చేయడం తమ్ముడి స్టయిల్. ఈ ఇద్దరూ రామ-లక్ష్మణుల్లా ఉండాలని వారి తల్లి కోరిక. కానీ, అలా ఉండరు. ఈ అన్నతమ్ముల్లిద్దరి మధ్య సాగే ట్రాక్ చాలా వినోదంగా ఉంటుంది.
తమిళ ‘వేట్టయ్', హిందీ ‘రామ్‌లఖన్'లా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఉంది?
ఆ సినిమాలకీ ఈ సినిమాకీ అస్సలు పోలిక లేదు. నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో వినోదం, యాక్షన్ ఉంటాయి. ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఈ వేసవికి కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రాన్ని ఇస్తున్నాం.
ఈ సినిమా కోసం 12 కేవీ లైట్ ఏదో వాడారట?
మామూలుగా కీలక సన్నివేశాలకు, పాటలకు మాత్రమే ఈ లైట్ వాడుతుంటాం. కానీ, కెమేరామేన్ మనోజ్ పరమహంస సినిమా మొత్తం వాడదామన్నారు. ఖర్చుతో కూడుకున్నది కావడంతో ‘మొత్తం 105 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు వద్దంటే వేరే లైట్ వాడదాం’ అని నిర్మాత బుజ్జిగారితో అన్నాం. కానీ, కథకు న్యాయం జరగాలి కాబట్టి, రాజీపడొద్దన్నారు. సినిమాకి ఏది కావాలన్నా సమకూర్చారు కాబట్టే, ఫలితం బ్రహ్మాండంగా ఉంది. సినిమా చూసినవాళ్లకి ఆ లైట్ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది.
‘కిక్ 2’ చేయనున్నారట.. ఆ విశేషాలు?
అది ‘కిక్'కి సీక్వెల్ కాదు. వేరే కథతో రూపొందించనున్నాం. రవితేజ హీరోగా చేస్తారు. హీరో కల్యాణ్‌రామ్ నిర్మిస్తారు. ఇంకా అంతా కొత్తవాళ్లతో ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటున్నా. దీన్ని ‘ఠాగూర్' మధు నిర్మిస్తారు.
హిందీ ‘కిక్'కి అవకాశం వస్తే ఎందుకు చేయలేదు?
అప్పుడు ‘ఊసరవెల్లి'తో బిజీగా ఉన్నాను.
మరి.. భవిష్యత్తులో హిందీ సినిమాలు చేసే ఆలోచన ఉందా?
ఉంది. ‘ఊసరవెల్లి'ని హిందీలో రీమేక్ చేయాలని ఉంది.
ఆ సినిమా ఇక్కడ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడానికి కారణం?
నేనిప్పటివరకు చేసిన అన్ని కథల్లోకల్లా అత్యుత్తమం ‘ఊసరవెల్లి’. ఆ సినిమా విజయం విషయంలో నా అంచనా నిజం కాలేదు. స్క్రీన్‌ప్లే ఇంకా పకడ్బందీగా ఉండాలేమో అనిపిస్తోంది. హిందీ వెర్షన్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటున్నా.
ఎన్టీఆర్‌తో చేసిన రెండు (అశోక్, ఊసరవెల్లి) సినిమాలూ ప్రేక్షకాదరణ పొందకపోవడంపట్ల మీ ఫీలింగ్?
అసంతృప్తిగా ఉంది. అతనితో ఓ హిట్ సినిమా చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చేస్తాను.
మహేశ్‌బాబుతో మళ్లీ ఎప్పుడు సినిమా?
మహేశ్‌లాంటి హీరోతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనే ఉంటుంది. అన్నీ కుదిరితే తనతో కూడా తప్పకుండా సినిమా చేస్తా.