
తెలుగులో ఆషికి-2 మొదలైంది
‘‘హిందీ ‘దబాంగ్’ చిత్రాన్ని తెలుగులో ‘గబ్బర్ సింగ్’గా తీస్తే పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు ‘ఆషికి-2’ని రీమేక్ చేస్తున్నాం. అందులో పాటల్ని తెలుగులోనూ వాడుతున్నాం’’ అని నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు. సచిన్, నజియా జంటగా జయ రవీంద్ర దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, జయంత్ క్లాప్ ఇచ్చారు.
రంజిత్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ -‘‘ ‘ఒరేయ్ పండు’ తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది’’ అని చెప్పారు. నజియా మాట్లాడుతూ -‘‘నేను సంజయ్‌దత్ మేనకోడల్ని. ఇంత మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. జయ రవీంద్ర, కాశీ విశ్వనాథ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, సంగీతం: అంకిత్ తివారి. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. చంద్రశేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల