ఆ అనుబంధం గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది
‘‘ఇది చాలా గొప్ప సినిమా. చూస్తున్నంతసేపూ ఏయన్నార్‌గారితో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది’’ అని బుధవారం ఓ ప్రకటనలో కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య నటించిన ‘మనం’ చిత్రాన్ని కమల్‌హాసన్ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘నేను శివాజీ గణేశన్‌గారి అభిమానిని. ఏయన్నార్ అంటే కూడా విపరీతమైన ఇష్టం. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం రెట్టింపు అయ్యింది.
ఈ సినిమాలో వినోద ప్రధానంగా సాగే సన్నివేశాలకు అందరూ నవ్వుతుంటే, ఏయన్నార్‌గారితో నాకున్న అనుబంధం గుర్తొచ్చి ఏడుపొచ్చింది. ఆయన భౌతికంగా మాత్రమే దూరమయ్యారు. నాగార్జున, నాగచైతన్య... ఇలా వారి కుటుంబ సభ్యుల గుండెల్లో జీవించి ఉన్నట్లుగా, నా తలపులలోనూ ఆయన జీవించే ఉన్నారు. ‘మనం’లాంటి గొప్ప సినిమా తీసినందుకు ఏయన్నార్ అభిమానిగా ఆయన కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు’’ అన్నారు.