త్వరలోనే...తల్లిని కావాలనుకుంటున్నా : రాణీ ముఖర్జీ
సినీ ప్రముఖుడు ఆదిత్యా చోప్రాతో నటి రాణీ ముఖర్జీ అనుబంధం కొన్నేళ్ళుగా హిందీ చలనచిత్ర రంగంలో చర్చనీయాంశమే. దాని గురించి ఎవరెన్ని ప్రచారాలు చేసినా, వ్యాఖ్యలు చేసినా రాణీ ముఖర్జీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ, ఇటీవలే ఇద్దరూ వివాహం చేసుకోవడంతో ఇప్పుడు ఆమె తొలిసారిగా నోరు తెరిచారు. చాలా మంది ప్రచారం చేస్తూ, తనను తప్పు పట్టినట్లుగా ఆదిత్య వ్యక్తిగత జీవితాన్ని తానేమీ భగ్నం చేయలేదనీ, ఆయన వైవాహిక జీవితం భగ్నమై, విడాకులు తీసుకున్న తరువాతే ఆయనతో తాను కలిసి గడపడం మొదలుపెట్టాననీ 36 ఏళ్ళ రాణీ ముఖర్జీ వెల్లడించారు. ఆదిత్యతో తన అనుబంధం మొదలైన తీరు దగ్గర నుంచి తాజా వివాహం దాకా అసలు విషయాలను అంతరంగం నుంచి ఆవిష్కరించారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే....
నేనూ మామూలు ఆడపిల్లనే. నా వ్యక్తిగత జీవితాన్ని గుట్టుగా ఉంచుకోవాలనీ, నా గురించి నలుగురూ అనే మాటలకు నా తల్లితండ్రులు జవాబివ్వాల్సిన పరిస్థితి రాకూడదనీ ఇన్నేళ్ళుగా పెదవి విప్పలేదు. పెళ్ళయ్యాకే ఈ సంగతులన్నీ చెప్పాలనుకున్నాను. అదే చేస్తున్నాను. పైగా, ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మొగ్గ దశలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఆదిత్యకూ, నాకూ మధ్య ఓ దశాబ్ద కాలంగా అనుబంధముందని అనుకుంటున్నారంతా. అది శుద్ధ తప్పు. కానీ, అప్పుడు ఆ మాటతో జనానికి నచ్చజెప్పలేను కాబట్టే మాట్లాడకుండా ఉన్నా.
‘కుఛ్ కుఛ్ హోతా హై’ చేస్తున్నప్పుడు కరణ్ జోహార్ ద్వారా ఆదిత్యను తొలిసారిగా కలిశా. మా పరిచయం పెరిగి స్నేహంగా మారింది. ఏ విషయమైనా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. ఆయనలో నాకు నచ్చింది అదే. మా ఇద్దరి బంధం గాఢమైంది గడచిన మూడేళ్ళుగానే. అంతకు ముందు మేమిద్దరం చక్కటి స్నేహితులం. అంతే. కెరీర్‌లో నేను, విడాకులతో వ్యక్తిగత జీవితంలో ఆయన వెనుకబడి ఉన్నప్పుడే మా అనుబంధం చిక్కబడింది. అంతకు ముందు మేం సినిమాలు చేసినా, ఎప్పుడూ సినిమాల గురించే మా చర్చ. చుట్టూ ఉన్నవారు మా మధ్య ఏదో ఉందని ప్రచారం చేయడమే, ఒక రకంగా మేం దగ్గరవడానికి కారణమైంది.
నేను, ఆదిత్య ఒకే రకంగా ఆలోచిస్తుంటాం. తల్లితండ్రులంటే ఆయనకు ప్రాణం. నాకూ తల్లితండ్రులే లోకం. ఆయన ఎన్నడూ ఎవరికీ హాని చేయరు. అవతలివాళ్ళలోని మంచినే చూస్తారు. పదిహేడో ఏటే సినీ రంగంలోకి వచ్చిన నేను ఇక్కడ ఎంతోమంది వ్యక్తులను, వాళ్ళ స్వభావాలనూ చూశాను. వ్యక్తిగతంగా గౌరవాస్పదుడిగా కనిపించిన వ్యక్తినే ప్రేమించాలనుకున్నా. ఆదిత్య అలాంటి వ్యక్తి కావడంతో, మా మధ్య ప్రేమ చిగురించింది. శక్తిని శాంతపరచాలంటే, శివుడు కావాలని బెంగాలీలో చెబుతారు. నేను పార్వతినైతే, అచ్చంగా నన్ను ప్రేమించి, సాంత్వన చేకూర్చిన పరమ శివమూర్తి ఆయన. మా ఇంటికి వచ్చి, మా అమ్మానాన్నల ముందే ఆయన తొలిసారిగా మా పెళ్ళి ప్రతిపాదన చేశారు.
మా పెళ్ళి జరగకూడదని చాలామంది అనుకున్నారు. కానీ, మేము మాత్రం దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇంతలో యశ్ చోప్రా మరణించారు. కొన్నాళ్ళు గడిచాక, ఉన్నట్టుండి ఒకరోజు మా నాన్నకి గుండెపోటు వచ్చింది. మరణం అంచుల దాకా వెళ్ళారు. ఆయన ఉండగానే పెళ్ళి చేసుకోవాలనే ఆ రోజే నిర్ణయించుకున్నాం. ఆపరేషన్ అయ్యాక, డాక్టర్ అనుమతి తీసుకొని, ఇటలీకి వెళ్ళి, అక్కడ నేను అనుకున్నట్లుగా బెంగాలీ పద్ధతిలోనే పెళ్ళి చేసుకున్నాం. పెళ్ళయ్యాక, నేను వెళ్ళి ఆయన ఇంట్లో ఉంటున్నాను తప్ప, అంతకు మించి మార్పేమీ లేదు. త్వరలోనే బిడ్డను కనాలనుకుంటున్నా. మాతృత్వమనేది దేవుడు స్త్రీకి ఇచ్చిన వరం. బిడ్డకు జన్మనివ్వడంతో స్త్రీ ఒక్కసారిగా దాదాపు దేవుడంత అవుతుంది.