నాకు సెల్ఫీ నచ్చదు
సృష్టిలో అమ్మతనాన్ని మించిన కమ్మదనం మరొకటి ఉండదంటారు. అలాంటి మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు నటి స్నేహ. నవ్వితే నోటి నుంచి ముత్యాలు రాలుతున్నాయా అన్నంత ఆకర్షణ ఈమె నవ్వులో ఉంది. ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ కుటుంబ కథా చిత్రాల నాయకి ఇమేజ్‌ను సంపాదించుకున్న స్నేహ మలయాళంలోనూ పలు మంచి చిత్రాలను చేసి బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. 2000వ సంవత్సరంలో విరుంబుగిరేన్(ఇష్టపడుతున్నాను)అంటూ నాయకిగా కోలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ తొలి చిత్రంలోనే చక్కని అభినయాన్ని చూపి మంచి నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత నటిగా తను వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. తమిళంలో అచ్చముండు అచ్చముండు చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు ప్రసన్నతో పరిచయం ప్రేమగా మారడంతో అది పెళ్లికి దారి తీసింది. 2012లో ప్రసన్నతో ఏడడుగులు నడిచారు. 2015 ఆగస్ట్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. వివాహానంతం నటనకు దూరంగా ఉన్న స్నేహ మధ్యలో భర్తతో కలిసి వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్‌షోలు లాంటివి చేశారు. ఎక్కువగా కుటుంబానికే సమయాన్ని కేటాయించిన స్నేహ ఇటీవల మళ్లీ నటనకు తిరిగారు. ఒక టీవీ డాన్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా స్నేహ ఇచ్చిన భేటీ చూద్దాం..
ప్ర: సంసార జీవితం ఎలా ఉంది:
జ : చాలా చాలా హ్యాపీగా సాగుతోంది.
ప్ర: మీ అబ్బాయి విహాన్ ముచ్చట్లేమిటీ?
జ : విహాన్ ఒట్టి అల్లరివాడు. చాలా చలాకీగా ఉంటారు. వాడి ప్రతి మూమెంట్‌ను మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. విహాన్‌కిప్పుడు ఏడాది దాటింది.అందుకే నేను మళ్లీ నటించడానికి సిద్ధమయ్యాను. వృత్తి రీత్యా మాకు ఎంత ఒత్తిడి ఉన్నా విహాన్ నవ్వుతో అంతా మటుమాయం అయిపోతుంది.
ప్ర: వాళ్ల నాన్న ప్రసన్నతో విహాన్ ఎట్రాసిటి ఎలా ఉంటుంది?
జ: కాళీ సమయాల్లో ప్రసన్న విహాన్‌తోనే గడుపుతారు. తండ్రికొడుకులిద్దరూ తరచూ సెల్ఫీలు తీసుకుంటారు. విహాన్ వాళ్ల నాన్న మాదిరిగానే సెల్ఫీకి ఫోజులిస్తాడు. నేను ఎప్పుడైనా వారితో సెల్ఫీ తీసుకుంటాను. సాధారణంగా నాకు సెల్ఫీ అంటే అంత నచ్చదు.
ప్ర: ఈ మధ్య ఎవరి నుంచి అయినా ప్రశంసలు అందుకున్నారా?
జ: ఇంట్లో మంచి కోడలిగా పేరు తెచ్చుకున్నాను.
ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాల వివరాలు?
జ: ఇంతకు ముందు మలయాళంలో మమ్ముట్టితో కలిసి రెండు చిత్రాలు చేశాను. మళ్లీ ఇప్పుడు ఆయనతో కలిసి గ్రేట్ ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్నాను. నిజానికి మళ్లీ నటించడంపై నాకు ఆసక్తి లేదు.
ప్ర: ప్రస్తుత నటీనటుల్లో మీకు ఎవరంటే ఇష్టం?
జ: నటుడు విజయ్‌సేతుపతి అంటే చాలా ఇష్టం. ఇటీవల కలిసినప్పుడు ఆయనతో ఇదే విషయాన్ని చెప్పాను.ఆయన ఎంచుకుంటున్న కథలు, పాత్రల పోషణ, సంభాషణలు చెప్పే విధానం, ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా సహజ నటన నాకు నచ్చాయి. ఇక హీరోయిన్లు అందరూ చక్కగా నటిస్తున్నారు.