నిజం ఏంటో మాకు తెలుసు!
‘‘ప్రతి హీరో అభిమాని సినీ ప్రేమికుడే. ఓ పర్టిక్యులర్ హీరోని అభిమానించడానికి ముందు సినిమాని ప్రేమిస్తాడు. తమ హీరో సినిమాలు తప్ప మిగతా వాళ్లవి అభిమానులు చూడరని అనుకుంటారు. ఎవరి అభిమానులైనా సినిమాలన్నీ చూస్తారు. అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ చూస్తేనే ఏ సినిమాకైనా వంద కోట్లు వస్తాయి. హీరోలకు ఫ్యాన్స్ బిగ్గెస్ట్ సపోర్ట్. అది కాదనడంలేదు. కానీ, వాళ్లతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ముఖ్యమే’’ అన్నారు వరుణ్ తేజ్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. వరుణ్ చెప్పిన విశేషాలు....
♦ ఈ ‘మిస్టర్’ అందరికీ ప్రేమను పంచుతాడు. ప్రేమే కాదు... ఎవరైనా సహాయం కావాలన్నా మిస్టర్ ముందడుగు వేస్తాడు. అలాంటి ఓ అబ్బాయికి సమస్యలు వస్తే.. అతను ప్రేమ వెతుక్కుంటూ వెళితే.. ఏం జరిగిందనేది కథ. నాకూ, హీరోయిన్లు లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్‌లకు వేర్వేరు కథలు (ఫ్లాష్‌బ్యాక్స్) ఉంటాయి. అవి కాకుండా మా ముగ్గురి మధ్య జరిగే కథే సినిమాకు కీలకం.
♦ శ్రీను వైట్లగారు ‘ఆనందం’, ‘నీ కోసం’... ఇలా అందమైన ప్రేమకథా చిత్రాలు చేశారు. తర్వాత స్టార్ హీరోలతో కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు చేశారు. మళ్లీ ఓ అందమైన ప్రేమకథా చిత్రం చేయాలనీ, ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలని ‘మిస్టర్’ తీశారు. ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’... మూడింటిలో ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు చేశాను. ఇందులో నా వయసుకు తగ్గ లైవ్లీ క్యారెక్టర్ చేశా.
♦ శ్రీను వైట్లగారు అనే కాదు... ఏ దర్శకుడితో చేసినా వాళ్ల గత సినిమా హిట్టయ్యిందా? లేదా? అనేది చూడను. అలా ఆలోచిస్తే... నా మొదటి సినిమా, మూడో సినిమా వర్కౌట్ అవ్వలేదు. నాతో చేయాల్సిన అవసరం వాళ్లకూ లేదు. ఇంకా సక్సెస్‌ఫుల్ హీరోలు ఉన్నారు కదా. నాకు కథ నచ్చితే మిగతా అంశాలు ఆలోచించను.
♦ కథల ఎంపికలో నాన్నగారు జోక్యం చేసుకోరు. ‘నీకు కథ నచ్చకపోతే నువ్వు చేయలేవు. కథలో నీకు నువ్వు కనిపించాలి’ అని చెప్పారాయన. ఆయనకు నచ్చి, నాకు నచ్చని కథలు ఉన్నాయి. నాన్నగారు కాకుండా... ఫ్యామిలీలో పెదనాన్నతో ఎక్కువ క్లోజ్. యంగ్ జనరేషన్‌లో చరణ్ అన్నతో క్లోజ్. తేజూ (సాయిధరమ్ తేజ్) కూడా క్లోజే. తనదీ నా వయసే. మా ఫ్యామిలీ హీరోలంతా కలిస్తే సినిమాల గురించి 20 శాతం, వ్యక్తిగత విషయాల గురించి 80 శాతం డిస్కస్ చేసుకుంటాం.
‘చిరంజీవికీ, పవన్‌కల్యాణ్‌కీ పడడం లేదు’ వంటి వార్తలు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అనడిగితే...
♦ ఫ్యామిలీ మెంబర్‌గా నెగిటివ్ వార్తలు చూసినప్పుడు బిగినింగ్‌లో బాధ ఉండేది. అందులో నిజమెంత అనేది వ్యక్తిగతంగా మాకు తెలుసు. కానీ, బయటకు వచ్చి జనాలకు వివరణ ఇచ్చే పరిస్థితులు ఎదురైనప్పుడు అసౌకర్యంగా ఉంటుంది.
♦ అభిమానులపై ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకోమని పెదనాన్న, బాబాయ్‌లు చెబుతుంటారు. ‘మన ఫ్యామిలీ నుంచి ఇంతమంది (8) నటులు వచ్చారు. ఒక్కొక్కరూ ఏదో కొత్తదనం చూపకపోతే, మీ సినిమాలు చూడాల్సిన అవసరం ప్రేక్షకులకు లేదు. బయట ఆల్రెడీ చాలామంది హీరోలున్నారు. మీరు కొత్తగా ఏం చేయగలరనేది మీరు ఆలోచించుకోండి’ అని ఎప్పుడూ అంటుంటారు. మా బెస్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మంచి కథలు దొరికితే మా అంజనా బేనర్, కొణిదెల ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్‌లోనూ సినిమాలు చేయాలని ఉంది.
♦ స్టార్ దర్శకులతోనే చేయాలనే రూల్ పెట్టుకోలేదు. ‘మిస్టర్’ షూటింగ్ మధ్యలో గాయమైనప్పుడు రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నా. అప్పుడు ఓ 20 కథల వరకూ విన్నాను. ‘ఫిదా’ తర్వాత కొత్త దర్శకుడు వెంకీ అట్లూరితో బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌గారి నిర్మాణంలో సినిమా చేయబోతున్నా.