చిరంజీవిగారితో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది
చిరంజీవిగారితో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది
Published Tue, Dec 17 2013 2:01 AM | Last Updated on Mon, May 28 2018 2:13 PM
‘‘ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా... ఓర్పుతో ఈ చిత్రాన్ని పూర్తి చేయగలిగానంటే కారణం ఇద్దరు. వారిలో ఒకరు మహానటుడు ఎన్టీఆర్ అయితే, రెండో వ్యక్తి పవన్‌కల్యాణ్’’ అని వైవీఎస్ చౌదరి అన్నారు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రేయ్’. ఈ చిత్రం ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్‌లో నాగబాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ -‘‘నమ్మిన సిద్ధాంతం కోసం, అంకితభావంతో మడమ తిప్పకుండా ముందుకెళ్లడం ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నాను.
అలాగే, ఈ సినిమా నిర్మాణం విషయంలో ఆటుపోటులు ఎదురవుతున్నప్పుడు ‘ఏం చేయను’ అని పవన్‌కల్యాణ్‌గారిని అడిగితే ‘కమిట్‌మెంట్‌ని, కాండక్ట్‌ని నేను నమ్ముతాను. ఆ రెండూ నీలో ఉన్నాయి. నువ్వు ఈ సినిమాను పూర్తి చేయగలవ్’ అని నాలో ఆత్మసై్థర్యాన్ని నింపారు. ఈరోజు సినిమాను ఇంత గ్రాండ్‌గా పూర్తి చేయగలిగానంటే కారణం వారిద్దరే. ఇక సాయిధరమ్‌తేజ్‌తో పనిచేస్తుంటే చిరంజీవిగారితో పనిచేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఫైట్లు, డాన్సులు అద్భుతంగా చేశాడు. ఇందులో శ్రద్ధ్దాదాస్ లేడీ విలన్‌గా నటించింది. యూత్‌కి మంచి కిక్ ఇచ్చే ప్రేమకథ తీయాలనుకున్నాను... తీశాను. పబ్లిసిటీ విషయంలో కొత్తగా ప్లాన్ చేశాం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘చరిత్ర సృష్టించే ముందు కష్టాలు ఎదురవ్వడం సహజం. వైవీఎస్ పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతాడు.
తన సినిమా ద్వారా మా మేనల్లుడు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది. తనంటే నాకు, అన్నయ్యకు, తమ్ముడుకీ చాలా ఇష్టం. రషెస్ చూశాను. తన డాన్సులు, ఫైట్లు.. ముఖ్యంగా నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’’ అని నాగబాబు చెప్పారు. కొత్త హీరోను పరిచయం చేస్తూ.. ఇంత భారీగా తీయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలని, ఆ రెండు వైవీఎస్‌కు ఉన్నాయని సాయిధరమ్‌తేజ్ అన్నారు. తన మావయ్య నాగబాబు చేతులపై ప్రమోషన్ మొదలవ్వడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా శ్రద్ధాదాస్, చంద్రబోస్, చక్రి, కొమ్మినేని వెంకటేశ్వరరావు,శ్రీధర్ సీపన, గౌతంరాజు, శరత్‌మరార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement