నరేశ్
‘‘ఏ ఆర్టిస్ట్‌కైనా సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. ఏడెనిమిదేళ్ల క్రితం మంచి హిట్ వస్తే బావుంటుంది అనుకున్నాను. గతేడాది వచ్చిన హిట్ సినిమాల్లో సుమారు 8 సినిమాల్లో నటించాను. నాపై దర్శకులు ఉంచిన నమ్మకంతోనే ఆ పాత్రలు వచ్చాయి. గతేడాది మన ఇండస్ట్రీ చాలా బావుంది. అలాగే నాకు కూడా. ఈ ఏడాదిని కూడా అలానే కొనసాగించాలనుంది. పాత్రల్లో ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నాను’’ అన్నారు నటుడు నరేశ్. ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..
► ‘శతమానం భవతి’ నా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. 2018 మన తెలుగు సినిమాలకు హెల్తీయస్ట్ ఇయర్. ‘ఛలో, తొలిప్రేమ, రంగస్థలం, మహానటి, సమ్మోహనం, దేవదాస్, అరవింద సమేత.., శైలజారెడ్డి అల్లుడు’.. ఇలా చాలా సినిమాల్లో కనిపించాను. ‘సమ్మోహనం’ లో చేసిన పాత్ర నన్ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణగారికి థ్యాంక్స్ చెప్పాలి. సీనియర్ డైరెక్టర్స్‌తో పాటు యువ దర్శకులు కూడా ఆయా పాత్రలకు నన్ను ఎంచుకోవడం çహ్యాపీ. నాకు పారితోషికం ముఖ్యం కాదు.. పాత్ర ముఖ్యం.
► నటుడిగా 47 ఏళ్లు పూర్తి చేసుకొని 48లోకి వెళ్తున్నాను. మరో రెండేళ్లలో గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటాను. నా క్రమశిక్షణ, ఇండస్ట్రీలో పెంచుకున్న గుడ్‌విల్, వివాదాల్లోకి వెళ్లకపోవడం.. నా సుదీర్ఘ ప్రయాణానికి కారణం అయ్యాయనుకుంటాను. చిన్న బడ్జెట్ సినిమాలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాను, ఉంటాను కూడా. కొత్త కాన్సెప్ట్‌లు, కొత్త ఐడియాలకు సిద్ధం. వెబ్ సిరీస్‌లకు కూడా అడుగుతున్నారు కానీ మంచి కాన్సెప్ట్‌తో డిజిటల్‌గా కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను.
► గతేడాది మూడు షిఫ్ట్స్ పని చేశా. ఈ ఏడాది కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. పాత్రల ఎంపికలో మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. క్వాలిటీ, బ్యానర్‌లు ఇవన్నీ చూసుకొని ఎంచుకుంటాను. ప్రస్తుతం కార్తికేయతో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా, ఫణిరాజా అని బుర్రాసాయి మాధవ్ అసోసియేట్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ‘పవనిజం 2’ సినిమాలో విలన్‌గానూ చేస్తున్నాను.
► రెండు బయోపిక్స్‌లో (మహానటి, ఎన్టీఆర్) మంచి పాత్రలు చేయడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో బీఏ సుబ్బారావు పాత్ర ఇచ్చినందుకు క్రిష్, బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి.
► ఇంతకు ముందు తమిళ, మలయాళ రీమేక్స్ కోసం మనవాళ్లు వెళ్లేవారు. ఇప్పుడు వేరే భాషల వాళ్లే మన సినిమా రీమేక్స్ కోసం వస్తుండటం మంచి పరిణామం. మా అబ్బాయి నవీన్ ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాతో రాబోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment