
'డబ్బు కోసం సినిమాల్లో నటించడం లేదు'
ముంబై: డబ్బుల కోసం తాను సినిమాల్లో నటించలేదని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ అంది. డబ్బులు కావాలంటే మరో పనిచేసి సంపాదించేదాన్నని చెప్పింది. స్వర తాజాగా అశ్వినీ అయ్యర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో ఆమె ఓ టీనేజ్ అమ్మాయికి తల్లిపాత్రలో నటించింది.
'నేను డబ్బుల కోసం ఇంతవరకూ ఏ సినిమాలోనూ నటించలేదు. నేను నటించిన సినిమాలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోవాలి. అంతేకానీ ఓ ఇడియట్లా కనిపించాలని కోరుకోవడం లేదు. నేను చనిపోయినా గౌరవంగా గుర్తించుకోవాలి. అశ్వినీ అయ్యర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చినపుడు తిరస్కరించాలని భావించా. అదే ఉద్దేశ్యంతో స్ర్కిప్ట్ చదివాను. ఆ తర్వాత తెలిసింది ఇది అద్భుతమైన స్ర్కిప్ట్ అని. ఈ పాత్ర చేయడం నటిగా నాకు సవాల్' అని స్వర చెప్పింది.