ఆస్కార్ అవార్డుకు ప్రయత్నించలేదు
ఆస్కార్ అవార్డు కోసం తానెప్పుడూ ప్రయత్నించలేదని సంగీతజ్ఞాని ఇళయరాజా పేర్కొన్నారు. శనివారం ఈ రోడ్‌లో నెలకొల్పిన గ్రంథాలయ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఇళయరాజా మాట్లాడుతూ తాను సంగీత దర్శకుడవ్వాలని చెన్నైకి బయలుదేరినప్పుడు ఒక ఆర్మోనియా పెట్టెతో వచ్చానని గుర్తుచేసుకున్నారు. అయితే ఇప్పుడున్నవారు అలా రావలసిన అవసరం లేదన్నారు. అంతా కంప్యూటర్‌మయం అయ్యిందని అన్నారు.
ఇప్పుడు పాటకు సొంతంగా ఆలోచించి ట్యూన్ కట్టాల్సిన అవసరం లేదని కంప్యూటర్‌లో పొందుపరచిన శబ్దాలను తీసుకుని సమకూర్చుకుని ట్యూన్స్ కడితే మీరు తలాడిస్తారని చురకలేశారు. మరో విషయం ఏమిటంటే సినిమా పాటలు రాయడానికి ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు రచయితలు చెప్పుకుంటున్నారని, నిజానికి ప్రసవ వేదన ఏమిటన్నది కన్నతల్లులకే తెలుసని పాటలురాయడం అనే సులభమైన, సాధారణమైన విషయాన్ని ప్రసవ వేదనతో పోల్చడం సరి కాదని ఇళయరాజా పేర్కొన్నారు. ఈతరం గీత రచయితలు పాటల్లో తన సొంత రచన అధికంగా ఉంటుందని ఈ విషయాన్ని ఈ వేదికపై బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు.
అయితే ఆ రచయితలెవరన్నది మాత్రం వెల్లడించడం ఇష్టం లేదన్నారు. తన సంగీతాన్ని వింటున్నప్పుడు కలిగే ప్రశాంతత, ఆనందం పుస్తకాల పఠనంలోనూ లభిస్తుందన్నారు. తాను ఆస్కార్ అవార్డుల కోసంప్రయత్నించలేదని తెలిపారు. తన సంగీతానికి గురువులు ప్రేక్షకులేనని అన్నారు. ఏ కాలంలో అయినా సప్త స్వరాలను మీటి సంగీతాన్ని రూపొందించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. వ్యాపార రంగంగా మారడం వలనే తాను సంగీత పాఠశాలను నెలకొల్పలేదని వివరించారు. దేన్నీ విజయంగా భావించరాదన్నారు. అలా భావిస్తే ఒక చట్రంలోకి నెట్టబడుతారని ఇళయరాజా తన మనోభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.