ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు!
నల్ల పిల్ల.. అంటే రెండు అర్థాలు. ఒకటి నల్లగా ఉన్న అమ్మాయి అని, మరొకటి మంచి (నల్ల అంటే తమిళంలో మంచి) అమ్మాయి అని అర్థం. రెండోది అభినందన కాబట్టి, ఎవరైనా ఇష్టపడతారు. కానీ, మొదటిది మాత్రం దాదాపు ఇష్టపడరు. అలాంటివాళ్లల్లో శ్రుతీహాసన్ ఒకరు. చూడచక్కగా ఉండే శ్రుతి ఒంటి రంగు పాలతో పోల్చదగ్గది కాదు. ఈ బ్యూటీ కొంచెం రంగు తక్కువ. తెల్లగా ఉండి ఉంటే బాగుండేదని చిన్నప్పుడు చాలా బాధపడేవారట.
అలా బాధపడేవాళ్ల కోసం ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ గురించి చెబుతారా? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే – ‘‘అస్సలు చెప్పను. నేను ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌ని ప్రమోట్ చేయను. ఎందుకంటే, నా చిన్నప్పటిలా ఇప్పుడు నేను రంగుకి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. రంగు తక్కువగా ఉన్నామని ఎందుకు బాధపడాలి? అందుకే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌ని ప్రమోట్ చేయను. అలాగే, ఆల్కహాల్‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా చేయను. ఎందుకంటే, మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది’’ అని చెప్పారు.