Fairness creams
-
చర్మం రంగు ముఖ్యం కాదని తెలుసుకున్నా
‘‘నల్లగా ఉంటే అందంగా కనిపించం అనే అభిప్రాయం చిన్నప్పుడే నాలో బలంగా నాటుకుపోయింది. తెల్లగా కనపడాలనే తాపత్రయంతో నా ముఖానికి పౌడర్లు, క్రీములు రాసుకునేదాన్ని. కానీ చర్మం రంగు ముఖ్యం కాదని ఇప్పుడు తెలుసుకున్నాను’’ అన్నారు ప్రియాంకా చోప్రా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పదేళ్ల క్రితం తాను ‘ఫెయిర్‌నెస్ క్రీమ్’ ఉత్పత్తికి ప్రచారకర్తగా వ్యవహరించడం గురించి మాట్లాడారామె. ఈ విషయం గురించి ప్రియాంక చెబుతూ– ‘‘ఆ క్రీమ్‌ని ప్రచారం చేసినందుకు అప్పట్లో నన్ను చాలామంది విమర్శించారు. రంగుని, జాత్యాహంకారాన్ని ప్రమోట్ చేస్తున్నట్లే అని అన్నారు. ఆ ఉత్పత్తిని ప్రమోట్ చేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. తెల్లగా కనబడాలనుకోవడం ఇక్కడ చాలా కామన్ విషయం. ఇంత పెద్ద ఇండస్ట్రీ (సినిమా)లో నటీమణుల రంగు గురించి ఆలోచించడం సహజం. అయితే ఫెయిర్‌నెస్ క్రీములను ప్రమోట్ చేయడం సరికాదని అనిపించిన క్షణం నుంచీ మానేశాను. నా కజిన్స్ తెల్లగా ఉంటారు. మా నాన్నగారు నల్లగా ఉంటారు. అదే రంగు నాకు వచ్చింది. మా ఫ్యామిలీవాళ్లు నన్ను ‘కాలీ... కాలీ.. కాలీ.. ’ అని సరదాగా పిలిచేవారు. నా పదమూడేళ్ల వయసులో ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడి, నా రంగుని మార్చుకోవాలనుకున్నాను (నవ్వుతూ)’’ అన్నారు. ఇంతకీ కాలీ.. కాలీ... అంటే ఏంటీ? అంటే నలుపు రంగు అని అర్థం. -
యూనిలీవర్ బాటలోనే లోరియల్ కూడా..
న్యూఢిల్లీ: పోలీసుల కస్టడీలో చనిపోయిన నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రారంభమైన నిరసనల సెగ ప్రపంచ ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థలకు తగిలింది. ఈ నేపథ్యంలో హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ తన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఫెయిర్‌నెస్ క్రీం పేరులో నుంచి ‘ఫెయిర్’ పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్ కూడా యూనిలీవర్ బాటలోనే పయనిస్తుంది. ఈ క్రమంలో చర్మ సౌందర్యాన్ని పెంచే తమ ఉత్పత్తుల ప్యాక్‌ల మీద ‘వైట్, ఫెయిర్, లైట్’ పదాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..) ఆసియా, ఆఫ్రికన్, కరేబియన్ దేశాలలో తెల్లని మేనిఛాయే సౌందర్యానికి ప్రామాణికమనే భావన ఏన్నో ఏళ్లుగా పాతుకు పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనిలీవర్, లోరియల్ కంపెనీలు స్కిన్ వైట్నింగ్ క్రీములను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషయంలో గ్లోబల్ మార్కెట్లో ఈ కంపెనీల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నది. లోరియల్ ఉత్పత్తులలో గార్నియర్ స్కిన్ నేచురల్స్ వైట్, కంప్లీట్ మల్టీ యాక్షన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఉన్నాయి. మరో కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికే ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలో విక్రయించే తన స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ న్యూట్రోజెనా, క్లీన్ అండ్ క్లియర్ ఉత్పత్తులను అమ్మడం మానేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు!
నల్ల పిల్ల.. అంటే రెండు అర్థాలు. ఒకటి నల్లగా ఉన్న అమ్మాయి అని, మరొకటి మంచి (నల్ల అంటే తమిళంలో మంచి) అమ్మాయి అని అర్థం. రెండోది అభినందన కాబట్టి, ఎవరైనా ఇష్టపడతారు. కానీ, మొదటిది మాత్రం దాదాపు ఇష్టపడరు. అలాంటివాళ్లల్లో శ్రుతీహాసన్ ఒకరు. చూడచక్కగా ఉండే శ్రుతి ఒంటి రంగు పాలతో పోల్చదగ్గది కాదు. ఈ బ్యూటీ కొంచెం రంగు తక్కువ. తెల్లగా ఉండి ఉంటే బాగుండేదని చిన్నప్పుడు చాలా బాధపడేవారట. అలా బాధపడేవాళ్ల కోసం ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ గురించి చెబుతారా? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే – ‘‘అస్సలు చెప్పను. నేను ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌ని ప్రమోట్ చేయను. ఎందుకంటే, నా చిన్నప్పటిలా ఇప్పుడు నేను రంగుకి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. రంగు తక్కువగా ఉన్నామని ఎందుకు బాధపడాలి? అందుకే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఫెయిర్‌నెస్ క్రీమ్స్‌ని ప్రమోట్ చేయను. అలాగే, ఆల్కహాల్‌కి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా చేయను. ఎందుకంటే, మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది’’ అని చెప్పారు. -
తాప్సీ నో చెప్పింది!
పింక్ సినిమా గత సెప్టెంబర్ నెలలో విడుదలైన తర్వాతి నుంచి హీరోయిన్ తాప్సీ వరుసపెట్టి వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు బాగా వచ్చాయి. ఆ తర్వాత ఆమెను అవార్డు ఫంక్షన్లకు, వివిధ కార్యక్రమాలకు ఎక్కువగానే పిలుస్తున్నారు. వాటిలో ఆమె మహిళా సాధికారత గురించి మాట్లాడుతోంది. అయితే.. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాప్సీ నో చెప్పిందట. ఎందుకని ఆరా తీస్తే.. ఆ కార్యక్రమాన్ని ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండు వాళ్లు స్పాన్సర్ చేస్తున్నట్లు తెలిసింది. తమ క్రీములు వాడితే మహిళలు తెల్లగా అవుతారంటూ ప్రచారం చేయడం పట్ల పలువురు హీరోయిన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. జైపూర్ సదస్సులో కూడా మహిళా సాధికారత సమస్యల గురించే ప్రధానంగా చర్చించారు. కానీ అలాంటి కార్యక్రమానికి ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండు వాళ్లు స్పాన్సర్ చేయడాన్ని తాప్సీ అంగీకరించలేకపోయింది. దాంతో ఆమె ఆ కార్యక్రమానికి వచ్చేది లేదని స్పష్టం చేసింది. అలా క్రీములు రాసుకుంటే తెల్లగా అయిపోతారన్న విషయాన్ని తాను నమ్మబోనని, అందుకే రాలేనని చెబుతూ అందుకు సారీ కూడా చెప్పింది. చిట్టచివరి విషయంలో తాను విరమించుకున్న విషయం నిజమేనని, కానీ ఫెయిర్‌నెస్ క్రీమ్ వాళ్ల స్పాన్సర్ షిప్ కూడా అప్పుడే తెలిసిందని ఆమె చెప్పింది. నిజానికి తాను తెల్లగా ఉండటం వల్ల కొన్ని సినిమా చాన్సులు కూడా కోల్పోయానని అందువల్ల వాటిని తాను ప్రమోట్ చేయబోనని కుండ బద్దలుకొట్టింది. -
'అలా ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు'
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ 'ఫెయిర్‌నెస్ క్రీమ్'ల ప్రకటనలపై తనదైన శైలిలో స్పందించారు. బహుళ జాతీయ సంస్థలన్నీ తప్పుడు ప్రకటనలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పుకొచ్చారు. సహజంగానే అందంగా ఉన్న అమ్మాయిలను కెమెరా జిమ్మిక్కులతో రంగు తక్కువగా చూపించి.. ఆ తర్వాత వాళ్ల ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడడం వల్లే తెల్లగా అయ్యారని చూపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 'నేను ప్రపంచమంతా గాలించాను.. ఇలాంటి క్రీములు వాడటం వల్ల తెల్లగా అయిన ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా నాకు కనిపించలేదు. తప్పుడు వాగ్ధానాలతో సదరు కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయ'ని రాందేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని సన్యాస ఆశ్రమంలో రాందేవ్ మాట్లాడుతూ.. పతంజలి గ్రూప్ కూడా విభిన్నమైన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్‌ను మార్కెట్లోకి తెచ్చిందని, అయితే అవన్నీ సహజ సిద్ధమైనవని చెప్పుకొచ్చారు. త్వరలోనే పతంజలి స్వదేశీ నూడుల్స్.. టాప్ బ్రాండ్ అయిన మ్యాగీని ఓవర్ టేక్ చేస్తుందని ఆకాక్షించారు. తన అభివృద్ధిని చూసి పలువురు పగ పెంచుకుంటున్నారని ఆరోపించారు. 'ఒకే ఒక్క మనిషి ఇంత వేగంగా విజయవంతంగా విరాజిల్లడం ఓర్వలేనివారందరికీ ఇదే నా ఆహ్వానం.. రండి, నాలానే 19 గంటలు నిబద్ధతతో పనిచేయండి.. అప్పుడు నా అభివృద్ధి విషయంలో మీకున్న అనుమానాలన్నీ పటాపంచలౌతాయి' అని పేర్కొన్నారు. పతంజలి బ్రాండ్ ఉత్పత్తుల వల్ల పొందుతున్న ఆదాయమంతా వివిధ చారిటీలకు అందుతుందని బాబా ఈ సందర్భంగా వెల్లడించారు. ఏ జాతి సంపదైనా ఆ జాతికి ఉపయోగపడాలని, ఆ నినాదంతోనే పతంజలి పనిచేస్తుందని వివరించారు.