తాప్సీ నో చెప్పింది!
తాప్సీ నో చెప్పింది!
Published Thu, Feb 2 2017 10:52 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
పింక్ సినిమా గత సెప్టెంబర్ నెలలో విడుదలైన తర్వాతి నుంచి హీరోయిన్ తాప్సీ వరుసపెట్టి వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు బాగా వచ్చాయి. ఆ తర్వాత ఆమెను అవార్డు ఫంక్షన్లకు, వివిధ కార్యక్రమాలకు ఎక్కువగానే పిలుస్తున్నారు. వాటిలో ఆమె మహిళా సాధికారత గురించి మాట్లాడుతోంది. అయితే.. తాజాగా రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తాప్సీ నో చెప్పిందట. ఎందుకని ఆరా తీస్తే.. ఆ కార్యక్రమాన్ని ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండు వాళ్లు స్పాన్సర్ చేస్తున్నట్లు తెలిసింది. తమ క్రీములు వాడితే మహిళలు తెల్లగా అవుతారంటూ ప్రచారం చేయడం పట్ల పలువురు హీరోయిన్లు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే.
జైపూర్ సదస్సులో కూడా మహిళా సాధికారత సమస్యల గురించే ప్రధానంగా చర్చించారు. కానీ అలాంటి కార్యక్రమానికి ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండు వాళ్లు స్పాన్సర్ చేయడాన్ని తాప్సీ అంగీకరించలేకపోయింది. దాంతో ఆమె ఆ కార్యక్రమానికి వచ్చేది లేదని స్పష్టం చేసింది. అలా క్రీములు రాసుకుంటే తెల్లగా అయిపోతారన్న విషయాన్ని తాను నమ్మబోనని, అందుకే రాలేనని చెబుతూ అందుకు సారీ కూడా చెప్పింది. చిట్టచివరి విషయంలో తాను విరమించుకున్న విషయం నిజమేనని, కానీ ఫెయిర్‌నెస్ క్రీమ్ వాళ్ల స్పాన్సర్ షిప్ కూడా అప్పుడే తెలిసిందని ఆమె చెప్పింది. నిజానికి తాను తెల్లగా ఉండటం వల్ల కొన్ని సినిమా చాన్సులు కూడా కోల్పోయానని అందువల్ల వాటిని తాను ప్రమోట్ చేయబోనని కుండ బద్దలుకొట్టింది.
Advertisement
Advertisement