'అలా ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు'
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ 'ఫెయిర్నెస్ క్రీమ్'ల ప్రకటనలపై తనదైన శైలిలో స్పందించారు. బహుళ జాతీయ సంస్థలన్నీ తప్పుడు ప్రకటనలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పుకొచ్చారు. సహజంగానే అందంగా ఉన్న అమ్మాయిలను కెమెరా జిమ్మిక్కులతో రంగు తక్కువగా చూపించి.. ఆ తర్వాత వాళ్ల ఫెయిర్నెస్ క్రీమ్ వాడడం వల్లే తెల్లగా అయ్యారని చూపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 'నేను ప్రపంచమంతా గాలించాను.. ఇలాంటి క్రీములు వాడటం వల్ల తెల్లగా అయిన ఒక్కరంటే ఒక్క అమ్మాయి కూడా నాకు కనిపించలేదు. తప్పుడు వాగ్ధానాలతో సదరు కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయ'ని రాందేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబైలోని సన్యాస ఆశ్రమంలో రాందేవ్ మాట్లాడుతూ.. పతంజలి గ్రూప్ కూడా విభిన్నమైన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ను మార్కెట్లోకి తెచ్చిందని, అయితే అవన్నీ సహజ సిద్ధమైనవని చెప్పుకొచ్చారు. త్వరలోనే పతంజలి స్వదేశీ నూడుల్స్.. టాప్ బ్రాండ్ అయిన మ్యాగీని ఓవర్ టేక్ చేస్తుందని ఆకాక్షించారు. తన అభివృద్ధిని చూసి పలువురు పగ పెంచుకుంటున్నారని ఆరోపించారు. 'ఒకే ఒక్క మనిషి ఇంత వేగంగా విజయవంతంగా విరాజిల్లడం ఓర్వలేనివారందరికీ ఇదే నా ఆహ్వానం.. రండి, నాలానే 19 గంటలు నిబద్ధతతో పనిచేయండి.. అప్పుడు నా అభివృద్ధి విషయంలో మీకున్న అనుమానాలన్నీ పటాపంచలౌతాయి' అని పేర్కొన్నారు.
పతంజలి బ్రాండ్ ఉత్పత్తుల వల్ల పొందుతున్న ఆదాయమంతా వివిధ చారిటీలకు అందుతుందని బాబా ఈ సందర్భంగా వెల్లడించారు. ఏ జాతి సంపదైనా ఆ జాతికి ఉపయోగపడాలని, ఆ నినాదంతోనే పతంజలి పనిచేస్తుందని వివరించారు.