న్యూఢిల్లీ: పోలీసుల కస్టడీలో చనిపోయిన నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రారంభమైన నిరసనల సెగ ప్రపంచ ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థలకు తగిలింది. ఈ నేపథ్యంలో హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ తన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఫెయిర్‌నెస్ క్రీం పేరులో నుంచి ‘ఫెయిర్’ పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్ కూడా యూనిలీవర్ బాటలోనే పయనిస్తుంది. ఈ క్రమంలో చర్మ సౌందర్యాన్ని పెంచే తమ ఉత్పత్తుల ప్యాక్‌ల మీద ‘వైట్, ఫెయిర్, లైట్’ పదాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..)
ఆసియా, ఆఫ్రికన్, కరేబియన్ దేశాలలో తెల్లని మేనిఛాయే సౌందర్యానికి ప్రామాణికమనే భావన ఏన్నో ఏళ్లుగా పాతుకు పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనిలీవర్, లోరియల్ కంపెనీలు స్కిన్ వైట్నింగ్ క్రీములను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషయంలో గ్లోబల్ మార్కెట్‌లో ఈ కంపెనీల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నది. లోరియల్ ఉత్పత్తులలో గార్నియర్ స్కిన్ నేచురల్స్ వైట్, కంప్లీట్ మల్టీ యాక్షన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఉన్నాయి. మరో కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికే ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలో విక్రయించే తన స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ న్యూట్రోజెనా, క్లీన్ అండ్ క్లియర్ ఉత్పత్తులను అమ్మడం మానేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment