ఆ కామాంధుడి బారి నుంచి ఐష్‌ ఎలా తప్పించుకుందంటే? | i saved aishwarya rai from harvey, says her manager | Sakshi
Sakshi News home page

ఆ కామాంధుడి బారి నుంచి ఐష్‌ ఎలా తప్పించుకుందంటే?

Published Fri, Oct 13 2017 4:58 PM | Last Updated on Fri, Oct 13 2017 7:51 PM

i saved aishwarya rai from harvey, says her manager

ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌ లైంగిక ఆగడాలపై హాలీవుడ్‌లో దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. తాము వర్థమాన నటులుగా ఉన్నప్పుడు తమను వెయిన్‌స్టీన్‌ లైంగికంగా వేధించాడని ప్రముఖ నటీమణులు ఏంజెలినా జోలీ, గ్వైనెత్‌ పాల్ట్రో ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మెరిల్‌ స్ట్రీప్‌, జెన్నిఫర్‌ లారెన్స్‌, కేట్‌ విన్‌స్లెట్‌ వంటి నటీమణులు కూడా అతని తీరుపై దుమ్మెత్తిపోశారు.

'మూవీ మొఘల్‌' బిరుదుతో మూడు దశాబ్దాలపాటు నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన వెయిన్‌స్టీన్‌.. ఇప్పుడు చుట్టుముట్టిన లైంగిక ఆరోపణలతో తీవ్ర చిక్కుల్లో పడ్డాడు. సొంత కంపెనీ వెయిన్‌స్టీన్‌ కంపెనీ నుంచి ఆయనను తొలగించారు. అనేకమంది వర్ధమాన నటీమణులను హోటల్‌ గదికి పిలిపించుకొని.. వారితో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక దాడులు చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడినట్టు తాజాగా ఆరోపణలు వెలుగుచూశాయి.

ఈ క్రమంలో ప్రఖ్యాత బాలీవుడ్‌ నటి, బచ్చన్‌ కోడలు ఐశ్యర్యరాయ్‌ కూడా ఈ కామాంధుడి బారిన పడేదట. కానీ, అతని బారినపడకుండా తాను కాపాడినట్టు ఆమె మాజీ అంతర్జాతీయ టాలెంట్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు. వెయిన్‌స్టీన్‌.. ఐశ్యర్యను ఒంటరిగా కలువాలని కోరాడట. కానీ, తాను సమయస్ఫూర్తితో వ్యవహరించి వారి మధ్య అలా జరగకుండా చూశానని ఐష్‌ టాలెంట్‌ మేనేజర్‌ సిమన్‌ షెఫీల్డ్‌ 'వెరైటీడాట్‌కామ్‌'కు తెలిపారు. ఐశ్యర్య, వెయిన్‌స్టీన్‌ గతంలో పలు సందర్భాల్లో కలుసుకున్నారు. యామ్‌ ఫార్‌ గాలా, కేన్స్‌ చిత్రోత్సవం వంటి సందర్భాల్లో వారు కలిసి ఫొటోలు దిగారు.

'భారతీయ నటి ఐశ్యర్య రాయ్‌ వ్యవహారాలను నేను చూసుకొనే దానిని. హార్వేతో డీల్‌ చేస్తున్నప్పుడు ఐష్‌ను ఒంటరిగా కలుసుకునేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించాడు. అతనో వేధించే పంది. మేం ముగ్గురం ఉన్నప్పుడు మీటింగ్‌ నుంచి వెళ్లిపోవాలని అతను ఎన్నోసార్లు అడిగాడు. నేను మర్యాదగా నిరాకరించాను. మేం వెళ్లిపోతున్నప్పుడు ఓ సారి నన్ను అడ్డగించి.. 'ఐశ్యర్యను ఒంటరిగా వదిలేసేందుకు ఎంత కావాలి' అని అడిగాడు. నేను ఘాటుగా తిరస్కరించాను' అని ఆమె తెలిపారు. ఆ తర్వాత కూడా తనను వెయిన్‌స్టీన్‌ బెదిరించాడని, అయినా తన క్లయింట్‌ ఐష్‌ మీద అతని నీడ కూడా పడనీయలేదని ఆమె పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement