నోట్ల రద్దుపై స్పందించిన టాప్ హీరో
తిరువనంతపురం: పాత పెద్ద నోట్లు రద్దు చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాన్ని మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ స్వాగతించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని మంచి ఉద్దేశంతో తీసుకున్న మెరుపుదాడిగా ఆయన వర్ణించారు. సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి సలాం చేస్తున్నట్టు తన బ్లాగులో పేర్కొన్నారు.
‘పాత నోట్లను ఉపసంహరించడాన్ని మంచి సంకల్పంతో చేసిన మెరుపుదాడిగా భావిస్తున్నాను. చెప్పినట్టుగానే ప్రధాని మోదీ పనులు చేస్తున్నారు. నేను వ్యక్తులను ఆరాధించను. కానీ నిజాయితీగా తమ ఆలోచనలను అమలు చేసే వారిని ఎక్కువగా అభిమానిస్తాను. రూ. 500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేయడం నిజాయితీతో తీసుకున్న నిర్ణయమే. ఆరంభంలో నోట్ల కష్టాలు ఎదురైనా భవిష్యత్ లో మనకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. అవివేకంతో ఇటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోరని మనం గుర్తించాలి.
మద్యం షాపులు, సినిమా ధియేటర్లు, ప్రార్థనా స్థలాల్లో మనం క్యూలో నిలబడుతుంటాం. మంచి పని కోసం మనం క్యూలో నిలబడడం వల్ల హాని జరగదని నా అభిప్రాయమ’ని మోహన్‌లాల్ పేర్కొన్నారు. షూటింగ్ కోసం ఆయన రాజస్థాన్ వెళ్లారు. కాగా, నోట్ల కష్టాలతో సోమవారం కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.