ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కొందరి విషయంలో ఇది రివర్స్‌లో జరుగుతుంది. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ముందు రచ్చ గెలిచి, ఇప్పుడు ఇంట గెలవడానికి రెడీ అయ్యారు. అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ‘గూఢచారి’లో ఆమె కథానాయికగా నటించారు. ఆగస్టు 3న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శోభిత గురించి కొన్ని విశేషాలు..
తెనాలికి చెందిన శాంతాకామాక్షి, వేణుగోపాలరావు దంపతులకు 1992లో జన్మించారు శోభిత. తండ్రి మెరైన్ ఇంజినీర్. వృత్తిరీత్యా విశాఖకు మకాం మార్చారు. శోభిత ముంబైలో చదువుకున్నారు. కామర్స్‌లో డిగ్రీ చేసిన శోభిత, సింబయాసిస్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో పీజీలో చేరారు. చిన్నతనంలోనే కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్న శోభితకు విభిన్న రంగాల్లో ప్రవేశం, విజయం సాధించాలనేది ఆసక్తి. 2013లో బెంగళూరులో ఫెమీనా మిస్ ఇండియా పోటీలో ‘మిస్ ఇండియా ఎర్త్’ కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ టాలెంటెడ్, మిస్ డ్యాన్సింగ్ క్వీన్, మిస్ ఎటిమెస్ డిజిటల్ దివా బహుమతులను గెలుచుకున్నారు. ఫిలిప్పైన్స్‌లో జరిగిన మిస్ ఎర్త్–2013 పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. మిస్ ఫొటోజెనిక్, మిస్ ఎకో బ్యూటీ, మిస్ టాలెంట్ అవార్డులను గెలిచారామె.
మోడల్‌గా అవకాశాల వెల్లువ
రచ్చ గెలిచి ఇంట గెలిచేందుకు వచ్చినట్టుగా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు శోభిత. 2014 కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌లో మెరిసిన శోభితకు ఫ్యాషన్ ప్రపంచం ఆహ్వానం పలికింది. జాతీయస్థాయిలో పలు అగ్రశ్రేణి పత్రికలు ఆమె ఫొటోలను ప్రచురించాయి. ప్రముఖ ఫ్యాషన్, జ్యూవెలరీ డిజైనర్ల ఫ్యాషన్ షోలు, భారీ అవార్డు ఫంక్షన్లు శోభితకు రెడ్ కార్పెట్ పరిచాయి. రాష్ట్రంలోని ఓ ప్రముఖ వస్త్రపరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు.
హిందీలో తొలి అడుగు
బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసిన శోభితకు తొలి ఆడిషన్స్‌లోనే దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాలో లీడ్ రోల్ దక్కింది. ఈ చిత్రంలో శోభిత నటనకు ‘క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్’ లభించింది. తర్వాత అక్షయవర్మ దరకత్వంలో ‘కాలాకాండీ’ సినిమా చేశారామె. ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ‘మూథూన్’ సినిమాలో శోభిత సెక్స్‌వర్కర్‌గా నటిస్తున్నారు. ‘దృశ్యం’ సినిమా దర్శకుడు హిందీలో తొలిసారిగా తీస్తున్న ‘ది బాడీ’ సినిమాలోనూ ఇమ్రాన్ హష్మీ, రిషికపూర్‌తో నటిస్తున్నారు.
మాతృభాషలో సినిమా ఎప్పుడూ స్పెషలే
‘‘సొంత భాషలో సినిమా అవకాశమంటే స్పెషలే. నా తొలి హిందీ సినిమా విడుదలయ్యాక ‘గూఢచారి’ కోసం ఫోన్ చేశారు. భిన్నమైన థీమ్ కావటంతో అంగీకరించా. దర్శకత్వం నుంచీ అన్ని విభాగాల్లో అందరూ కష్టపడ్డారు. మంచి రిజల్ట్ వస్తుంది. తెలుగు పరిశ్రమలో పరిచయాల్లేవు. చాన్స్ వచ్చినపుడు నిరూపించుకోవాలనుకున్నా. తొలి సినిమానే సంతృప్తినిచ్చింది. మంచి కథ ఉన్నపుడు అన్ని పాత్రలూ ఎలివేట్ అవుతాయి. ఇప్పుడు తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి. నాకైతే తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలనుంది. భాషలు వేరైనా మనిషి ఎమోషన్స్ ఒకేలా ఉంటాయి కదా.
– బి.ఎల్. నారాయణ (సాక్షి, తెనాలి)
Comments
Please login to add a commentAdd a comment