
మార్షల్ ఆర్ట్స్‌కి రెడీ!
శ్రుతీహాసన్ కర్రసాము చేస్తే? విలన్లను ఎగిరెగిరి తంతే?.. ఈ గులాబీ బాల ఇవన్నీ చేయగలగుతారా? అని అనుమానంగా ఉందా? కానీ, శ్రుతీహాసన్‌కి మాత్రం ఎలాంటి అనుమానం లేదు. చెట్ల చుట్టూ తిరుగుతూ డ్యూయెట్లు పాడటం, నాలుగైదు సెంటిమెంట్ సన్నివేశాల ద్వారా మనసుని టచ్ చేయడం, కామెడీ చేసి నవ్వించడం.. ఇవన్నీ శ్రుతీకి బాగా తెలుసు. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు.
పూర్తి స్థాయి యాక్షన్ కథా చిత్రంలో నటించనున్నారు. హిందీలో బాజీగర్, సోల్జర్, రేస్, రేస్ 2 వంటి యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో శ్రుతీహాసన్ ఓ చిత్రంలో నటించనున్నారట. ఇటీవలే ఈ దర్శకులిద్దరూ శ్రుతీకి కథ చెప్పారనీ, ఆమెకు కూడా ఆ కథ నచ్చిందనీ భోగట్టా.
ఈ చిత్రంలో వీరోచితమైన పోరాట దృశ్యాల్లో నటించాలి కాబట్టి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే కేరళకు చెందిన కలరిపయ్యాట్టు అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ఆరంభం కానుంది. ఈలోపు పాత్ర గురించి అవగాహన పెంచుకోవడానికి వర్క్ షాప్స్‌కి కూడా హాజరు కావాలనుకుంటున్నారట.