చిరంజీవితో కామెడీ సినిమాలే చేస్తాను! | i will work with chiranjeevi on comedy script, says Kodandarami Reddy | Sakshi
Sakshi News home page

చిరంజీవితో కామెడీ సినిమాలే చేస్తాను!

Jul 10 2016 12:48 PM | Updated on Aug 28 2018 4:32 PM

చిరంజీవితో కామెడీ సినిమాలే చేస్తాను! - Sakshi

చిరంజీవితో కామెడీ సినిమాలే చేస్తాను!

మెగాస్టార్ చిరంజీవితో తాను సినిమా చేయాల్సి వస్తే కచ్చితంగా కామెడీ సబ్జెక్టును ఎంచుకుంటానని దర్శకుడు కోదండరామిరెడ్డి అన్నారు.

విజయవాడ:

-సినిమాలు ..సందేశాత్మకంగా ఉండాలి
-కొన్నింటిలో క్రైం ఎక్కువగా చూపిస్తున్నారు
-సినిమా వాళ్లకు ఇగో ఫీలింగ్స్ ఎక్కువ
-ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి

 చిరంజీవి 150వ సినిమా తన దర్శకత్వంలో తీయాల్సి వస్తే కామెడీతో కూడిన విధంగా తీసేవాడినని, చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కామెడీకి బాగా సరిపోతుందని ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి అన్నారు. చిరంజీవితో ప్రజాసేవ, రైతుల కోసం, సమాజసేవ అంటూ సినిమా తీస్తే జనం చూసినవ్వుతారన్నారు. తాను, చిరంజీవి మంచి మిత్రులమని...ఆయన బాడీ లాంగ్వేజ్ తనకు బాగా తెలుసునన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ సాధారణ సమావేశం ఆదివారం విజయవాడలోని హోటల్ గేట్‌వేలో జరిగింది.

 

ఈ సమావేశంలో ముఖ్యవక్తగా పాల్గొన్న ఎ కోదండరామిరెడ్డి యువతపై సినిమా ప్రభావం అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వస్తే ఎలాంటి సినిమా చేసేవారని ఓ రోటరీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కోదండ రామిరెడ్డి పై విధంగా పేర్కొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినిమాలు వినోదంతో పాటు, సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ఉండాలన్నారు. ఇటీవల కొన్ని సినిమాల్లో క్రెం ఎక్కువగా చూపిస్తున్నారని, ఇవి కొంత వరకూ యువతపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. యువత సందేశం మాత్రమే తీసుకోవాలని ఆయన సూచించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరి హీరోల సినిమాలకు తాను దర్శకత్వం వహించానన్నారు.

 

అయితే అత్యధికంగా చిరంజీవితో 27 సినిమాలు తీశానని, వాటిలో 23 సినిమాలు మెగా హిట్‌గా నిలిచాయన్నారు. తన సినిమాలకు యండమూరి వీరేంధ్రనాథ్, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌లు తోడ్పాడు ఇచ్చారని, వారి సహకారంతోనే మంచి హిట్స్ వచ్చాయన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్‌టౌన్ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఇక్కడ అందరూ నవ్వుతూ, సరదాగా ఉంటున్నారన్నారు. కానీ సినిమాలో మాత్రం అలా ఉండరని, ఎవరికి వారేనని, సినిమా వాళ్లకు ఇగో ఫీలింగ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు తాడిపర్తి కిషణ్‌బాబు, సెక్రటరీ మాగంటి కృష్ణప్రభు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఆర్‌వీ సుబ్బారావు పలువురు రోటరీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement