పాప తండ్రే కారణం..
ముంబై: రోడ్డు ప్రమాదంలో గాయపడి, కోలుకున్న బిజెపి ఎంపి, ప్రముఖ సినీ నటి హేమమాలిని తొలిసారిగా నోరు విప్పారు. శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యి ఇంటికి చేరిన మరునాడు ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి చనిపోవడానికి ఆ పాప తండ్రే కారణమని హేమమాలిని బుధవారం తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఆయన ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదికాదని ఆరోపించారు.
'చిన్నారి మరణం నన్ను చాలా బాధపెట్టింది. ఆ పాప తండ్రి ట్రాఫిక్ నియమాలను పాటించి ఉంటే ఆ చిన్నారి బతికి ఉండేదని హేమమాలిని ట్విట్ చేశారు. అంతేకాకుండా సెన్సేషన్ కోసం పాకులాడే మీడియా ఈ ఘటనను అనసరంగా రాద్ధాంతం చేసిందని మడిపడ్డారు. మానవత్వాన్ని మరిచి ప్రవర్తించిన అలాంటి వారిపట్ల విచారం వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేనన్నారు. తన క్షేమం కోసం, ఆరోగ్యం కోసం ఆరాటపడిన అభిమానులు, ఆప్తులందరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రమాదం మూలంగా తనపై అభిమానులకు ఎంత ప్రేమ ఉందో స్పష్టమైంని, ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందని హేమమాలిని పేర్కొన్నారు.
కాగా ఆగ్రా నుంచి జైపూర్ వెళుతుండగా రాజస్థాన్‌లోని దౌసా దగ్గర హేమమాలిని ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారును మారుతి ఆల్టో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల పాప చనిపోగా, హేమమాలినితో పాటు ఐదురుగు గాయపడ్డారు . ఈ కేసులో హేమమాలిని డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రమాదం జరిగినపుడు హేమ తమను పట్టించుకోలేదని, సమయానికి పాపను ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేదని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.