ఇప్పుడు నేను మునుపటికన్నా స్ట్రాంగ్!
Published Thu, Nov 14 2013 12:05 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
సందర్భం మమతా మోహన్‌దాస్ బర్త్‌డే
మమతా మోహన్‌దాస్ మంచి అందగత్తె... చక్కటి నటి... గొప్ప సింగర్... ఇవన్నీ కాదు. తనొక నడిచే నిలువెత్తు ఆత్మవిశ్వాసం. జీవితమంటే చీకటి వెలుగుల రంగేళి అని తనకు బాగా తెలుసు. గ్లామర్ ప్రపంచంలో ఎంతో ఎత్తుకి ఎదిగిన మమత, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ఓ పక్క కేన్సర్ వ్యాధి దేహాన్ని కబళిస్తుంటే ధైర్యంగా ఎదుర్కొని విజేతగా నిలిచారామె. నేడు మమత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫోన్‌లో ఆమెతో జరిపిన సంభాషణ.
చాలా గ్యాప్ తర్వాత ‘భాయ్’ సినిమాలో ఓ పాట పాడారు. ఇక, గాయనిగా కొనసాగుతారా?
పాటలు పాడటం నాకు చాలా ఇష్టం. వీలు కుదిరినంత వరకూ వచ్చిన ప్రతి పాటా పాడటానికే ట్రై చేస్తున్నాను. పాటలు పాడినప్పుడు తెలియకుండా నాలో ఏదో శక్తి పెరుగుతుంది. చెన్నయ్‌లో చికిత్స చేయించుకుంటూ, మధ్య మధ్యలో ‘భాయ్’ పాట రికార్డింగ్‌లో పాల్గొనడం చాలా రిలీఫ్ అనిపించింది. పైగా, దేవిశ్రీ ప్రసాద్‌లాంటి డైనమైట్‌తో వర్క్ చేయడం అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది.
చెన్నయ్‌లో చికిత్స అంటున్నారు.. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?
కేన్సర్ వ్యాధి తిరగబెట్టిన తర్వాత చికిత్స చేయించుకున్నాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను.
అంతా ఓకే కదా..!
నేను సేఫ్ జోన్‌లోనే ఉన్నాను. భవిష్యత్తులో కూడా చాలా సేఫ్‌గా ఉంటాను. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. జీవితంలో ఎదురైన అనుభవాల వల్లే ఇది తెలిసింది. అలాగే, నా కోసం తమ జీవితాలనే త్యాగం చేసే నా తల్లిదండ్రుల వల్ల కూడా జీవితం అంటే తెలిసింది.
హఠాత్తుగా మీ ఆరోగ్య స్థితిలో వచ్చిన మార్పు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందా లేక మనోస్థయిర్యాన్ని కోల్పోయేలా చేసిందా?
ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు నేను మునుపటికన్నా స్ట్రాంగ్. జీవితంలో మనకు తగిలే ప్రతి దెబ్బ మనల్ని ఇంకా బలంగా తయారు చేస్తుంది. ఆ దెబ్బలు మన గురించి మనకు చాలా విషయాలను తెలియజేస్తాయి. అలాగే, ఇతరుల గురించీ తెలియజేస్తాయి. కేన్సర్ తిరగబెట్టిందనగానే చాలామందిలా నేనూ చాలా భయపడ్డాను, బాధపడ్డాను. నేను మామూలు మనిషిని కాబట్టి అలా జరగడం సహజం. కానీ, కొన్ని నెలల్లోనే మానసికంగా నేను ధృడంగా తయారయ్యాను.
ఇప్పుడు చెన్నయ్‌లో ఎందుకు ఉంటున్నారు?
వైద్య సౌకర్యం నిమిత్తం ఇక్కడ ఉంటున్నాను. చెన్నయ్ నాకు చాలా ఇష్టం కాబట్టి, ఇక్కడ ఉండటం ఆనందంగానే ఉంది.
కేన్సర్ రోగులకు మీరిచ్చే సలహా?
ఆశావహ దృక్పథం కలిగించే వాతావరణంలో ఉండటం చాలా అవసరం. అలాగే, చుట్టూ ఉన్న మనుషులు కూడా పాజిటివ్ యాటిట్యుడ్ ఉన్నవాళ్లే ఉండాలి. నమ్మకం ఉండాలి. ఇవేవీ లేకపోతే ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది. మీకు మీరు చాలా ముఖ్యం. అందుకని, ఏ కారణాలవల్లనో ఎవరో వల్లో క్రుంగిపోవద్దు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడే మీరు దేన్నయినా జయించగలుగుతారు. కేన్సర్ కూడా ఓ మామూలు వ్యాధి అనే తరంలో ఉన్నాం మనం. ఈ వ్యాధికి సంబంధించి ఇంకా మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. కేన్సర్ తిరగబెట్టినా... భయపడకండి. నన్ను నమ్మండి. మీరు కచ్చితంగా జయించగలుగుతారు. ఒకవేళ మీరు చివరి దశలో ఉండి, డాక్టర్లు కూడా చేతులెత్తేస్తే, దానర్థం మందులు ఏమీ పని చేయవని. కానీ, నిజం ఏంటంటే, మీకోసం మీరు చాలా చేయగలుగుతారు.
ఓకే.. మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నారా?
కొన్ని కథలు వింటున్నాను. ప్రధానంగా మలయాళ సినిమాలపై దృష్టి పెట్టాను. ఎందుకంటే, అక్కడే సహజత్వానికి దగ్గరగా ఉన్న పాత్రలు వస్తాయనే నమ్మకం కుదిరింది. నన్ను సహజమైన పాత్రల్లో మలయాళ ప్రేక్షకులు అంగీకరించారు. నా సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఒకవేళ కమర్షియల్ సినిమాల్లో ‘స్ట్రాంగ్ రోల్స్’ వస్తే చేస్తాను. మలయాళంలో నేను చేసిన పాత్రలు మహిళలు లేక సమాజం గురించి ఏదో ఒక సందేశం ఇచ్చే విధంగానే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా అలాంటి పాత్రలకే నా ప్రాధాన్యం.
మీ భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంది?
చాలా బలంగా ఉంది.
మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?
రాంగ్ టైమ్‌లో రాంగ్ క్వశ్చన్ అడిగారు. ప్రస్తుతం నన్ను నేను పెళ్లి చేసుకున్నాను.
ప్రస్తుతం మీ జీవితం ఎలా ఉంది?
చాలా రిలాక్సింగ్‌గా ఉంది. నా గురించి నేను చాలా ప్రశాంతంగా కేర్ తీసుకుంటున్నాను.
ఈరోజు మీ పుట్టినరోజు కదా.. ఏం ప్లాన్ చేశారు?
ఇప్పటివరకు ఒకటి, రెండు మినహా నా బర్త్‌డేలన్నీ నా ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఇంట్లోనే జరిగాయి. ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని నేను వాళ్లకే వదిలేశాను. వాళ్లేం చేసినా కాదనను. నేను మాత్రం ‘కీర్’ తయారు చేసుకుని, సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. వాస్తవానికి నేను ప్రతి రోజూ మళ్లీ పుట్టినట్లుగా భావిస్తున్నాను. అందుకే ప్రతి రోజుకీ నా ధన్యవాదాలు.
గత ఏడాదికీ ఈ ఏడాది పుట్టినరోజుకీ వచ్చిన మార్పు?
ఒక్క ఏడాదిలో ఎంతో మార్పు వచ్చింది. వయసు పరంగా ఓ అంకె పెరిగింది. అయితే, వివేకం పరంగా చాలా ఏళ్లు పెరిగాను.
- డి.జి.భవాని
Advertisement
Advertisement