
ఫిట్‌గా తయారయ్యాను!
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సినిమాల్లో నటించి దాదాపు మూడేళ్లు పైనే అయ్యింది. కానీ, ఈ ఏడాది మాత్రం తన కెరీర్‌ని సీరియస్‌గా తీసుకున్నారామె. అందుకే, కొంచెం బరువు కూడా తగ్గారు. తను నటించబోయే రెండు సినిమాలను త్వరలో ప్రకటించబోతున్నారు సుస్మితా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘వాస్తవానికి ఓ ఏడాదిగా నేను సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకే బరువు తగ్గాను. ఇంతకుముందులా ఫిట్‌గా తయారయ్యాను.
ఈ ఏడాది వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకు చాలా బాగుంటుందనే నమ్మకం ఉంది. అందుకే, 2014 నాదే అని ధీమాగా చెబుతున్నా. నేను చేయబోయే రెండు సినిమాల్లో ఒకటి జూలైలో మొదలవుతుంది. ఆ తర్వాత రెండో సినిమా ప్రారంభమవుతుంది. ఈ ఏడాది నటిగానే కాదు.. ఓ తల్లిగా కూడా నా బిడ్డల భవిష్యత్తుని మరింత పటిష్టంగా ప్లాన్ చేయాలనుకుంటున్నా’’ అని తెలిపారు. 2000లో ఓ పాపను, ఆ తర్వాత పదేళ్లకు మరో పాపను సుస్మితా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వీళ్లని తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారామె. రీనీ, అలీషా తనకు రెండు కళ్లు అని కూడా ఆమె పేర్కొన్నారు.