రక్తదానం కాన్సెప్ట్‌తో...
‘‘తమిళంలో ఈ సినిమా నేనే చేయాలి. కథను జడ్జ్ చేయలేక వదులుకున్నాను. రక్తదానం కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఇందులో ఒక పాట పాడాను’’అని సందీప్ కిషన్ చెప్పారు. విజయ్ సేతుపతి, ‘కలర్స్’ స్వాతి, అశ్విన్, నందిత ముఖ్య తారలుగా గోకుల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని ‘ఇదేగా ఆశపడ్డావ్’ పేరుతో తెలుగులో అనువదించారు సమన్యరెడ్డి, సుజన్. సిద్దార్థ్ విపిన్ స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని దర్శకుడు హరీష్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘కలర్స్’ స్వాతి మాట్లాడుతూ -‘‘ఇందులో హీరో హీరోయిన్లు ఉండరు. అన్నీ పాత్రలే ఉంటాయి’’ అన్నారు. తెలుగులో దీన్ని రీమేక్ చేస్తే తానొక పాత్ర చేయాలనుకున్నానని నిఖిల్ తెలిపారు. విజయ్ సేతుపతి మంచి ఆర్టిస్ట్ అని, టైటిల్ బావుందని హరీష్ శంకర్ పేర్కొన్నారు. రాహుల్, రఘుబాబు, మహత్, నందిత, సంపూర్ణేష్‌బాబు తదితరులు మాట్లాడారు.