
సెలబ్రిటీలు వ్యవసాయం చేస్తే..?
పచ్చని పొలాల్లో నాయకా నాయికలు రొమాన్స్ చేస్తుంటే, చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. పొలం గట్ల వెంట పరిగెత్తుతూ సరసాలాడుకుంటుంటే అదో కనువిందు. ఇలా కాకుండా వాళ్లు నాగలి పట్టి పొలం దున్నితే చూడటానికి వింతగా, ఆసక్తిగా ఉంటుంది. ప్రేక్షకులకు ఇలాంటి వింతైన కార్యక్రమాన్ని చూపించడానికి హిందీ నటుడు సల్మాన్ ఖాన్ రెడీ అయ్యారు. సెలబ్రిటీలు పాలు పితకడం, వ్యవసాయం చేయడం వంటి అంశాలతో ఆయన ఓ రియాల్టీ షో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘బిగ్ బాస్’ రియాల్టీ షో చాలా పాపులర్ అయ్యింది. అయితే ఆ షోలో సెలబ్రిటీలు నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవడం, ఆడుకోవడం, కుదిరితే ఫైట్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు.
ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్ దీనికి పూర్తి భిన్నంగా ఉండే షో చేయాలనుకున్నారట. సొంత ప్రొడక్షన్‌లో ఆయన ఈ షోను రూపొందించాలనుకుంటున్నారు. విలేజ్ సెటప్‌లో ఈ షో ఉండనుంది. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలకు వ్యవసాయం చేయడం గురించి మొదట శిక్షణ కూడా ఇస్తారట. శిక్షణ తీసుకున్నవారికే షోలో పాల్గొనే అవకాశం ఉంటుందని సమాచారం. అలాగే ఈ షోలో వినోదం పాళ్లు ఎక్కువుండేలా స్క్రిప్ట్‌లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సల్మాన్.