
కథ నచ్చితే కొత్త దర్శకులతో సినిమా చేస్తా
- నట్టికుమార్
‘‘నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 ఏళ్లయింది. అతి తక్కువ సమయంలోనే 63 సినిమాలు చేశాను. ‘యుద్ధం’ తర్వాత మళ్లీ ఏ సినిమా చేయకూడదనుకున్నాను. కానీ మళ్లీ సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యాను’’ అని నిర్మాత నట్టికుమార్ చెప్పారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ- ‘‘నేను ఇండస్ట్రీలో చివరి వరకూ గౌరవించే వ్యక్తి దాసరినారాయణరావుగారు. ఆయన దగ్గరే మెలకువలు నేర్చుకున్నా.
ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ, రామానాయుడుగారు నాకు ఇష్టమైన వ్యక్తులు. రామానాయుడు నేను చేసే ప్రతి కార్యక్రమంలో ఉండేవారు. కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. మార్కెట్ విలువలు తగ్గడంతో సినిమాలు తీయడం మానుకున్నాను. కానీ ఈ సారి నుంచి నా పిల్లల పేర్ల మీద సినిమాలు తీస్తాను. మంచి కథతో ఏ దర్శకుడు వచ్చినా సినిమా తీయడానికి రెడీ. వచ్చే ఏడాది నా కుమారుడు క్రాంతిని ఓ పెద్ద బ్యానర్‌లో హీరోగా పరిచయం చేస్తాను’’ అని చెప్పారు.