
తమిళసినిమా: ఇటీవల నటి ఇలియానా వార్తల్లో ఎక్కువగా నానుతోందనే చెప్పాలి. దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే హిందీ చిత్రాల మోహంతో ముంబైకి మకాం మార్చిన ఈ అమ్మడికి అక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో పునరాలోచనలో పడి ఎక్కడ వదిలేసింది అక్కడే తిరిగి పొందాలని ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమపై దృష్టి సారించింది. ఆ విధంగా టాలీవుడ్‌లో రీఎంట్రీకి సిద్ధమైంది కూడా. ఈ విషయం పక్కన పెడితే ఇలియానా ప్రేమ వ్యవహారం ప్రేక్షకుల మధ్య కుతూహలాన్నే రేకెత్తిస్తోంది. ఈ అమ్మడు ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీపోన్ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలను తరచూ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉంటోంది. అయితే తన ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా ప్రకటించకపోవడంతో రకరకాల ప్రసారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
దీంతో ఇలియానా అలాంటి ప్రసారాలకు మీడియా వర్గాలపై ఆగ్రహంతో రంకెలు వేయడం పరిపాటిగా మారింది. అయితే ఇన్నాళ్లకు తన బాయ్‌ఫ్రెండ్ గురించి నోరు తెరిసింది. దీని గురించి ఇలియానా తెలుపుతూ ఆండ్రూ తన బాయ్‌ఫ్రెండ్ అని అంగీకరించింది. అయితే మాకు పెళ్లి అయ్యిందని, గర్భం దాల్చానని రకరకాల వదంతులు ప్రచారం అవుతుండడం మాత్రం ఇబ్బందికరంగా ఉందని చెప్పింది. నిజం చెప్పాలంటే తమకు పెళ్లి జరగలేదని, తాను గర్భం దాల్చలేదని స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే అలాంటి సంఘటన జరిగితే సంతోషమేనని, త్వరలోనే అది జరగాలని తానూ కోరుకుంటున్నానని అంది. అయితే అందుకు ఇంకా సమయం ఉందని చెప్పింది. నాకు నన్ను అర్థం చేసుకునే ప్రేమికుడు లభించాడని అంది. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం అని చెప్పింది. తన మనసుకు బాధ కలిగినప్పుడు తాను వెతికే మొదటి వ్యక్తి అండ్రూ అని పేర్కొంది. సాధారణంగా తాను మనోవేదనకు గురైనప్పుడు ఎవరినీ కలవనని చెప్పింది. ఇంటిలోనే ఒంటరిగా కూర్చుని ఏడ్చేస్తానని అంది. ఆ సమయంలో ఎవరైనా తనను కలవాలని ప్రయత్నిస్తే వారిని గట్టిగా తిట్టేస్తానని చెప్పింది. అలాంటి తనను పూర్తిగా మార్చింది ఆండ్రూనేనని అంటోంది ఇలియానా.
Comments
Please login to add a commentAdd a comment