హత్తుకోగానే భలే అనిపించింది!
హత్తుకోగానే భలే అనిపించింది!
Published Thu, Mar 13 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
ఏ వ్యక్తి జీవితంలో అయినా మళ్లీ మళ్లీ తల్చుకుని ఆనందించదగ్గ సంఘటనలు కొన్ని ఉంటాయి. ఇలియానాకు కూడా అలాంటివి ఉన్నాయి. ఇటీవల ఓ సందర్భంలో ఆ మధురానుభూతుల గురించి ఈ గోవా సుందరి చెబుతూ -‘‘ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్దగా సంతోషపెడుతుంటాయి. అప్పుడప్పుడూ గుర్తొస్తుంటాయి. అలా, నా మూడేళ్ల మేనల్లుడు చేసే చిలిపి పనులు నాకెప్పుడూ గుర్తొస్తాయి. వాడు భలే ముద్దుగా ఉంటాడు. ఆ మధ్య ఓసారి గట్టిగా వాణ్ణి హత్తుకున్నాను. ఆ చిన్నారి స్పర్శ నాకు మరపురాని అనుభూతినిచ్చింది. ఆ స్పర్శ తాలూకు అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. అంతేకాదు, నేనిష్టపడేవాళ్లు పంపించే చిన్న సందేశం కూడా నా మనసు పొరల్లో దాగుంటుంది. ఇటీవల దర్శకుడు అనురాగ్ బసు ఇంట్లో ఓ పూజా కార్యక్రమం జరిగింది.
దానికోసం నేను ప్రత్యేకంగా కేక్ తయారు చేశాను. అనురాగ్‌కి ఆ కేక్ తెగ నచ్చింది. నాకు నచ్చినవాళ్లకి వండిపెట్టడం నాకిష్టం. ఆ వంటకం వాళ్లకు నచ్చితే ఇంకా ఇంకా సంతోషం. ఆ క్షణంలో వాళ్ల కళ్లల్లో కనిపించే ఆనందాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇలా నన్ను ఆనందపరిచే చిన్న చిన్న విషయాలను అప్పుడప్పుడూ గుర్తు చేసుకుని ఆనందపడిపోతుంటాను’’ అని చెప్పారు. ఇది ఇలా ఉంటే హిందీలో ఇలియానా నటించిన మూడో చిత్రం ‘మై తేరా హీరో’ వచ్చే నెల విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి లిప్ లాక్ సన్నివేశంలో నటించారు ఇలియానా. హీరో హీరోయిన్ల ఈ లిప్ లాక్ ఫొటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పెదవి ముద్దు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
Advertisement
Advertisement