రజనీకాంత్ అభిమానిని: షారుక్
సూపర్ స్టార్ రజనీకాంత్ కు పెద్ద ఫ్యాన్ ను అని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నారు. రజనీకాంత్ చిత్రం కొచ్చడయాన్ చిత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. ఓ మూడు కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. అందులో ఒకటి నేను రజనీకాంత్ అభిమానిని అని షారుక్ చెప్పారు.
తాను చిత్రాల్లో ప్రవేశించడానికి ముందు రజనీ సార్ నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ ను దూరంగా ఉండి చూశాను. ఆ చిత్రంలోని నటిస్టున్న తారలందరూ వారివారి పనిలో మునిగిపోగా.. ఓ పెద్ద అద్దం ముందు రజనీకాంత్ సిగరెట్ ను ఎగురవేస్తూ నోటి ద్వారా అందుకునేందుకు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారని షారుక్ అన్నారు. అప్పుడు రజనీకాంత్ అంకిత భావాన్ని చూసి.. ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే అని ఆయనను చూసి నేర్చుకున్నాను అని షారుక్ తెలిపారు. ఇక మూడవ కారణం ఆయనతో ఉన్న స్నేహం అని అన్నారు. రా.వన్ చిత్ర నిర్మాణ సమయంలో సౌందర్య, లతా మేడమ్, రజనీకాంత్ లు తనకు ఎంతో సహాయం చేశారని షారుక్ పాత విషయాలను గుర్తు తెచ్చుకున్నారు.
షారుక్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రంలోని రజనీ కాంత్ కు 'లుంగీ డాన్స్' పాటను అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద స్టార్ హోదా ఉన్న షారుక్.. రజనీకాంత్ అభిమానిని అని చెప్పడం తమిళ సినీ అభిమానులను సంతోషానికి గురి చేసింది.