
అప్పుడే పెళ్లా?
నటి అసిన్ పెళ్లి చేసుకున్నారా? ప్రస్తుతం బాలీవుడ్‌లో జరుగుతున్న వేడివేడి చర్చ ఇదే. కేరళ రాష్ట్రానికి చెందిన ముద్దుగుమ్మ అసిన్. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా ఒక రౌండ్ కొట్టి గజని చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. అక్కడ కూడా కొంత కాలం హవా కొనసాగించింది. ప్రస్తుతం అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో అసిన్ పెళ్లి చేసుకుని సంసార జీవితానికి శ్రీకారం చుట్టినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా ఆమెతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
మీకు పెళ్లి అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే ఓ ఇంటి వారయ్యారా?
నేను నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవడానికి అమెరికా వెళ్లినప్పుడు ఇలాంటి ప్రచారం నా వరకు వచ్చింది. వివాహ నిశ్చితార్థం జరిగిందని, పెళ్లి కొడుకుది అమెరికా అని, పెళ్లి కూడా అయిపోయిందని బాలీవుడ్ ప్రచారం చేసింది. హిందీ చిత్ర పరిశ్రమ సంస్కృతి చాలా భిన్నమైంది. అక్కడ డేటింగ్‌ల సంస్కృతి ఎక్కువ. పెళ్లి కాకుండానే బాయ్‌ఫ్రెండ్‌తో విదేశాలు చుట్టి వస్తారు. నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేస్తారు. నేను అమెరికా వెళ్లడం వల్ల నిశ్చితార్థం, పెళ్లి అంటూ ప్రచారం చేశారు.
ఏదేమైనా మీకు పెళ్లి విషయం గురించి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందిగా?
నిజమే. నా జీవితంలో తదుపరి అంశం వివాహమే. అలాగని నేను పెళ్లికి తొందర పడను. హిందీ తారల్లో చాలా మంది పెళ్లే వద్దని కాలం గడిపేస్తున్నారు. పలువురు వివాహం చేసుకోకుండానే లివింగ్ రిలేషన్‌షిప్ పేరుతో సహజీవనం చేస్తున్నారు. నా వరకు వస్తే పెళ్లి చేసుకోమని ఇంటిలో ఒత్తిడి చేస్తున్నారు. మంచి వరుడి కోసం అన్వేషణ జరుగుతోంది. మరో ఏడాది వరకు పెళ్లి చేసుకోను.
మీ జీవితంలో జరుగుతున్న మార్పులు?
ముందుకంటే బరువు తగ్గి బాగా స్లిమ్‌గా తయారయ్యాను. మంచి చిత్రాల్లో నటించాను. నిజం చెప్పాలంటే నాకిప్పుడు కాస్త విశ్రాంతి అవసరం. చదువుకునే రోజుల్లోనే నటించడానికి వచ్చా ను. కుటుంబం, నటన మినహా నా మనసులో వేరే ఆలోచన లేదు. సన్నిహిత స్నేహితురాళ్ల పెళ్లిళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి.
ఈ మధ్య విదేశాలు చుట్టొచ్చారట?
గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సుదీర్ఘ విదేశీయానం చేశాను. గ్రీస్ దేశంలో మొదలెట్టి రోమ్, వెని స్ వరకు వెళ్లాను. అమెరికా, కెనడా దేశాల్లోనూ కొన్ని రోజులు గడిపాను. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లోని అందాలను ఆస్వాదించాను.
సినిమా అవకాశాలు లేకపోతే తారలకు నిద్ర పట్టదుగా?
అలాంటి సందర్భం నా కెప్పుడు ఎదురుకాలేదు. నేనెప్పుడూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటాను. డబ్బు కోసం నేనెప్పుడూ నటించలేదు. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడను. షూటింగ్ అంటే సంతోషంగా వెళ్లాలి. ఇప్పుడు కూడా అలాంటి మంచి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను.