
కబాలిలో పాత రజనీ
ప్రస్తుతం సినీ వర్గాల చర్చ అంతా సూపర్ స్టార్ తాజా చిత్రం గురించే... ఈ చిత్రంలో రజనీకాంత్ పాత్ర ఏమిటీ? ఆయన గెటప్ ఎలా ఉంటుంది? సినిమా వాళ్లు ఏ నలుగురు కలిసినా ఇలాంటి అంశాల గురించే చర్చ. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కలైపులి ఎస్ థాను నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి కబాలి అనే పేరును ఖరారు చేసిన విషయం విదితమే. రాధిక ఆప్టే కథానాయికగా నటించనున్న ఈ ప్రిస్టేజియస్ చిత్రంలో నటించడానికి, రజనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి అత్య్రంత ఆసక్తిగా ఎదురు చూస్తునట్లు ఈ ఉత్తరాది భామ పేర్కొంది. ఇటీవల దర్శకుడు రంజిత్ రజనీకాంత్‌ను కలిశారు. అప్పుడు రజనీ ‘ప్రేక్షకుల ఆశీస్సులతో, అభిమానుల ప్రేమాభిమానాలతోనే నేను ఇంకా నటిస్తున్నాను. ఈ చిత్రాన్ని మీ ఇష్టప్రకారం తెరకెక్కించండి. ఇతర నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని మీరే ఎంపిక చేయండి.
చిత్రంలో కథా పాత్రల్ని మీకు నచ్చిన విధంగా రూపొందించండి’ అంటూ దర్శకుడు రంజిత్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారట. దీంతో కబాలి చిత్రంలో రజనీకాంత్‌ను చాలా కొత్తగా, యువకుడిగా చూపించడానికి దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారని సమాచారం. 1980 ప్రాంతంలో నటించిన ధర్మదొరై చిత్రంలో రజనీ ఎలా ఉన్నారో అంత ఫ్రెష్‌గా కబాలి చిత్రంలో చూపించడానికి ప్రఖ్యాత మేకప్ నిపుణులను రప్పిస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 17న ప్రారంభం కానుంది.