
వాళ్లు కూడా మనల్ని చూస్తున్నారు
భారతదేశ సినిమాల గురించి అంతర్జాతీయ ప్రేక్షకుల ఆలోచనా తీరు మారిందని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అన్నాడు. హాలీవుడ్‌లో దశాబ్దకాలం పూర్తిచేసుకున్న ఇర్ఫాన్.. ఈ అంశంపై మాట్లాడాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాల్లో అతడు తన ప్రతిభను చూపించిన విషయం తెలిసిందే. ప్రమన సినిమాల్లో కూడా నాణ్యత బాగా పెరుగుతోందని, అలాగే అంతర్జాతీయ సినిమా ఉత్సవాలలో కూడా మన సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయని.. దాంతో ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలకు ప్రాచుర్యం పెరుగుతోందని ఇర్ఫాన్ అన్నాడు.
అలాగే అంతర్జాతీయ బాక్సాఫీసులో కూడా భారతీయ సినిమాల కలెక్షన్లు బాగుంటున్నాయని, ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నాయని చెప్పాడు. ఒకప్పుడు విదేశాల్లో ఉండే భారతీయులు మాత్రమే మన సినిమాలు చూసేవారని, ఇప్పుడు మాత్రం పాశ్చాత్యులు కూడా మన సినిమాలు చూస్తున్నారని తెలిపాడు. భారతీయ నటులను గుర్తిస్తున్నారని, ఏవో చిన్న చిన్న పాత్రలకే మనల్ని పరిమితం చేయకుండా మంచి పాత్రలు కూడా ఆఫర్ చేస్తున్నారని అన్నాడు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ టామ్ హాంక్స్‌తో పాటు ఇన్ఫెర్నో అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు.