ఈ క్వొశ్చన్‌ ఎవరూ అడగలేదు! | Interview with Dulkar Salman | Sakshi
Sakshi News home page

దిల్‌కర్‌

Published Sun, Sep 23 2018 1:11 AM | Last Updated on Sun, Sep 23 2018 11:36 AM

 Interview with Dulkar Salman - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌కి పెళ్లయిపోయింది. ఒక కూతురు కూడా. అయినా చాలామంది అమ్మాయిలు దుల్కర్‌ని ‘దిల్‌కర్‌’, ‘దిల్‌కర్‌’ అని ‘దిల్‌దార్‌’గా ఇష్టపడతారు. ‘తప్పు కదా.. ఇలా చేయొచ్చా దుల్కర్‌’ అంటే.. ‘వాళ్లు ప్రేమిస్తున్నది నా ఫ్యామిలీ మొత్తాన్ని’ అంటారు. అందుకే మన ఫ్యామిలీలో ఈ ఇంటర్వ్యూ.

‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ కేరళ రూపురేఖలు వరదల కారణంగా మారాయి. మళ్లీ పూర్వపు స్థితికి రావడానికి చాలా టైమ్‌ పట్టేట్లుంది?
దుల్కర్‌: అవును. ప్రకృతి వైపరీత్యం చాలా నష్టాన్నే మిగిల్చింది. కేరళ రాష్ట్రం మళ్లీ మామూలు స్థితికి రావడానికి చాలా చాలా సమయం పడుతుంది.

దేశంలో ఇలాంటి విపత్తులు ఎక్కడ జరిగినా ‘మేమున్నాం’ అంటూ ఇతర చిత్రపరిశ్రమల వాళ్లు ముందుకు రావడం ఎలా అనిపించింది?
దుల్కర్‌: కళలకు భాషా భేదం లేదని అందరం అంటుంటాం. ఇలాంటివి జరిగినప్పుడు నిరూపిస్తాం. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల నుంచి సహాయం అందింది. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా స్పందించారు. ఇలాంటి కష్ట  సమయంలో అందరూ ఫీల్డ్‌లోకి దిగి వర్క్‌ చేయడం చాలా సంతోషంగా అనిపించింది.

అలాగే మీరు డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి రాలేదని కొందరు విమర్శించారు. దాని గురించి?
దుల్కర్‌: మనం అక్కడ ఫిజికల్‌గా లేకపోతే సహాయం చేయనట్లు కాదు. తొందరపాటుతో కామెంట్‌ చేసిన వాళ్ల కోసం ‘నేనీ సహాయం చేశాను’ అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఒకటిగా నిలబడిన ఇలాంటి సమయంలో నెగటివిటీని స్ప్రెడ్‌ చేయకపోవడం మంచిది. సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్ట్‌లు పెట్టేవాళ్లు ఒక్కరు కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్‌ దగ్గర ఉండరు. ఇలాంటి సమయాల్లో కావల్సింది యూనిటీ, పాజిటివిటీ. నెగటివిటీ కాదు.

మమ్ముట్టిగారు నటించిన ‘కసాబా’ సినిమాలో కొన్ని డైలాగ్స్‌ స్త్రీలను అగౌరవపరిచేలా ఉన్నాయని నటి పార్వతి విమర్శించారు. డైలాగ్స్‌ చెప్పేటప్పుడు మేల్‌ ఆర్టిస్టులు జాగ్రత్త తీసుకోవాలేమో?
దుల్కర్‌: పార్వతి తన మనసుకి అనిపించింది చెప్పారు. మేం ఏదైనా సినిమా ఒప్పుకున్నామంటే అందులో క్యారెక్టర్‌ ఎలా ఉంటే అలా చేయడం వరకే మా బాధ్యత. కొన్నిసార్లు తాగుబోతులా, డ్రగ్‌ అడిక్ట్‌లా చేయాల్సి వస్తుంది. దాన్ని బేస్‌ చేసుకొని అది అతని రియల్‌ లైఫ్‌ పర్సనాలిటీ అనుకుంటే తప్పు. ఒకవేళ ఈ ఇంటర్వ్యూలో ఏదైనా తప్పుంది అనుకుంటే అది నా పర్సనల్‌ ఒపీనియన్ కాబట్టి నన్ను నిందించవచ్చు. కానీ సినిమాల్లో చేసేదాన్ని పర్సనల్‌గా ఊహించుకొని బ్లేమ్‌ చేయకూడదన్నది నా ఒపీనియన్‌.

సినిమాల విషయానికొద్దాం. మలయాళం టు తెలుగు వయా తమిళ్‌.. ‘కార్వాన్‌’తో హిందీ స్క్రీన్‌కి. బిజీ బిజీగా ఉంటున్నారు..
దుల్కర్‌:
(నవ్వుతూ). అన్ని భాషల్లో చేస్తే అందరి అభిమానాన్ని పొందవచ్చు కదా. ప్రతిసారి కొత్త భాషలో ఫస్ట్‌ సినిమా చేస్తున్నప్పుడు అది కూడా ఓ మలయాళం సినిమానే అనుకుని చేస్తాను. ‘కార్వాన్‌’ సినిమా ఐడియా నచ్చింది. పాత్రలు చాలా ఆసక్తిగా ఉంటాయి. డెడ్‌ బాడీస్‌తో ట్రావెలింగ్‌ అనే పాయింట్‌ కొత్తగా అనిపించింది. పైగా ఇర్ఫాన్‌గారు ఒప్పుకున్నారంటే కచ్చితంగా మంచి సినిమా అయ్యుంటుంది. నా ఫస్ట్‌ సినిమాకే రీచ్‌ ఎక్కువ ఉంటుంది. అందుకని చేశాను.

దుల్కర్‌ అంటే అలెగ్జాండర్‌ అని అర్థం అట. ఆయన పలు రాజ్యాలను గెలుచుకున్నట్లు మీరు కూడా అన్ని ఇండస్ట్రీలను గెలుచుకోవాలనుకుంటున్నారా?
దుల్కర్‌: అలా ఏం లేదు. కానీ వేరే భాషల్లో చేసే అవకాశం రావడం లక్‌. జనరల్‌గా ఒకే ఇండ స్ట్రీలో ఫోకస్డ్‌గా ఉంటే బాగుంటుంది. అయితే అన్ని ఇండస్ట్రీలు తిరగడం వల్ల డిఫరెంట్‌ కల్చర్, రకరకాల మనుషులను కలుసుకోవడం, వాళ్లతో మాట్లాడటం, వాళ్లను తెలుసుకోగలగడం మంచి ఎక్స్‌పీరియన్స్‌గా భావిస్తాను. ‘మహానటి’ చేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకున్నాను. అందులో నేను చేసిన  జెమినీ గణేశన్‌గారి పాత్రకు మంచి డైలాగ్స్‌ రాశారు. వాటిని అర్థం చేసుకుంటేనే బాగా యాక్ట్‌ చేయగలుగుతాను. అందుకే ప్రతి పదాన్నీ అర్థం చేసుకొని నటించాను.

అంత అర్థం చేసుకున్నారు కాబట్టే ‘అమ్మాడి’ అనే పదాన్ని భలే పలికారేమో..
దుల్కర్‌:
ఈ మాట చాలామంది అన్నారు. ‘అమ్మాడి’ అని భలే అన్నారే అన్నప్పుడు హాయిగా నవ్వుతుంటాను. నిజానికి ‘మహానటి’ చేయాలా వద్దా అని ఆలోచించింది కూడా డైలాగ్స్‌ కరెక్ట్‌గా పలుకుతానా? లేదా అనే. ‘ఓకే బంగారం’కి కూడా డబ్బింగ్‌ చెప్పుకోలేదు. ‘డబ్బింగ్‌ చెప్పుకుంటే అది  సినిమాకు హెల్ప్‌ అవ్వాలే తప్ప హాని జరగకూడదు. తెలుగు కూడా వచ్చిన యాక్టర్‌ని పెట్టుకోవచ్చు కదా’ అన్నాను. ‘నువ్వు చేయగలవు’ అని టీమ్‌ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ‘మహానటి’ ఒప్పుకున్నాను.

కానీ రీసెంట్‌గా మీ నాన్నగారి (మమ్ముట్టి)తో మాట్లాడినప్పుడు ‘ఒక ఆర్టిస్ట్‌ తన రోల్‌కు తన వాయిస్‌ ఇచ్చినప్పుడే పర్ఫెక్ట్‌ యాక్టర్‌ అవుతాడు’ అన్నారు..
దుల్కర్‌: నాన్నగారు చెప్పిన విషయాన్ని నేను పూర్తిగా ఒప్పుకుంటాను. కానీ భాషకు న్యాయం చేయాలని కూడా నమ్ముతాను. పర భాషను గౌరవించాలి, అక్కడి మనుషులను గౌరవించాలి. తప్పుగా మాట్లాడితే క్యారెక్టర్‌కు సెట్‌ కాలేదంటారు. పైగా ఆ తప్పు తడకల వల్ల సినిమా తేలిపోతుంది. పర్ఫెక్ట్‌గా డబ్బింగ్‌ చెప్పగలం అనుకున్నప్పుడే చెప్పాలి. నాన్నగారు ఏ భాషలో సినిమా చేసినా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటారు. ఆయన పర్ఫెక్ట్‌గా చెబుతారు. ‘ఓకే కన్మణి’ (ఓకే బంగారం) తమిళ్‌లో నా సెకండ్‌ మూవీ. డబ్బింగ్‌ చెప్పమని అడగలేదు. ఒకవేళ నా అంతట నేను అడిగి డబ్బింగ్‌ చెప్పానంటే ఆడియన్స్‌కి ఎవరో ఏలియన్‌ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే చెప్పలేదు. ‘మహానటి’కి మాత్రం చాలా కష్టపడ్డాను. ఆ సినిమాకు డబ్బింగ్‌ చెప్పాకే ‘భాష వేరైనా మన వాయిస్‌ కూడా కచ్చితంగా ప్లస్‌ అవుతుంది’ అనిపించింది. ‘కార్వాన్‌’ సినిమాను సింక్‌ సౌండ్‌లో చేశాం. దానికి డబ్బింగ్‌ లేదు. లొకేషన్‌లో మేం లైవ్‌లో మాట్లాడిందే రికార్డ్‌ చేశారు.

ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చారు కాబట్టి నెపోటిజమ్‌ (బంధుప్రీతి) గురించి మీరేం అంటారు ?
దుల్కర్‌: మలయాళం సినిమాలో మేము (బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లు) మైనారిటీలాగా. ఎందుకంటే నేను యాక్టింగ్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకున్నప్పుడు పృథ్వీ రాజ్, ఫాహద్‌ ఫాజిల్‌ మాత్రమే ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవాళ్లు. మా ఫాదర్‌ టైమ్‌లో కూడా సెకండ్‌ జనరేషన్‌ యాక్టర్స్‌ తక్కువ. మేం స్టార్ట్‌ అయినప్పుడు కూడా సెకండ్‌ జనరేషన్‌ యాక్టర్స్‌ పెద్దగా వర్కౌట్‌ అవ్వలేదు అన్నారు. మేం కూడా సక్సెస్‌ అవ్వమనేది వాళ్ల ఫీలింగ్‌. కానీ సినిమా మీద ప్రేమతో, చేస్తున్న మంచి సినిమాల వల్ల మేం మంచి పొజిషన్‌లోనే ఉన్నాం అనుకుంటున్నాను. బంధుప్రీతి వల్ల అవకాశాలు రావు. ఎంట్రీ ఈజీ అవుతుందంతే.

సో.. సెకండ్‌ జనరేషన్‌ యాక్టర్స్‌ సక్సెస్‌ కాలేదు అన్నవాళ్లందరూ రాంగ్‌ అని ప్రూవ్‌ చేశారా?  
దుల్కర్‌: రాంగ్‌ అని ప్రూవ్‌ చేయడానికి పనిగట్టుకుని ప్రయత్నం చేయలేదు. జెన్యూన్‌గా నేను ఫీల్‌ అయ్యేది ఏంటంటే ‘మన ఫ్యామిలీ ట్యాగ్‌ వల్ల ఒకటి రెండు సినిమాలకు అవకాశం వస్తుంది తప్పితే ప్రూవ్‌ చేసుకోకపోతే రావు’ అని. నా కోసం నా ఫ్యామిలీ వచ్చి యాక్ట్‌ చేయరు కదా. ఒకవేళ ఫ్యామిలీ అండతో చాన్స్‌ వచ్చినా కెమెరా ముందు నేనే చేయాలి. నా కష్టానికి కొంచెం లక్‌ కూడా తోడవ్వాలి. మంచి సినిమాలు రావాలి. అలాగే నా సినిమాలకు 100 పర్సెంట్‌ నేనే బాధ్యుడ్ని అని అనడం లేదు. మంచి మంచి డైరెక్టర్స్‌తో యాక్ట్‌ చేయడం వల్ల ఇప్పుడీ పొజిషన్‌లో ఉన్నాను అనుకుంటాను. నేను చేసిన సినిమాలకు ఎవరైనా యస్‌ అంటారు.. అవి మంచి సినిమాలు కాబట్టి. నా బలమేంటంటే.. కొన్ని సినిమాలకు నో చెప్పగలగడం.

పెళ్లయ్యాకే సినిమాల్లోకి వచ్చారు. ఫీమేల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తక్కువ అవుతుందని ఏమైనా అనిపించిందా?
దుల్కర్‌: అస్సలు లేదు. యాక్టర్‌ అవ్వడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఫీమేల్‌ ఫ్యాన్స్‌ కాదు. నాకు సినిమా అంటే ఇష్టం. మంచి సినిమాలు చేద్దాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చాను. లక్కీగా నాకు ఫీమేల్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు (నవ్వుతూ). అందుకు హ్యాపీ. నా పెళ్లి 28 ఏళ్లకే  అయిపోయింది. మా ఫ్యామిలీలో అందరి పెళ్లిళ్లూ అలానే జరిగాయి. జనరల్‌గా కెరీర్‌తో  సంబంధం లేకుండా చాలామంది 25, 26 ఏళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వడానికి చూస్తుంటారు.

మమ్ముట్టిగారు ఓసారి లైఫ్‌లో ఎర్లీగా మ్యారేజ్‌ చేసుకుంటే కెరీర్‌ మీద ఇంకా ఫోకస్డ్‌గా ఉండొచ్చు అన్నారు. మీరు ఒప్పుకుంటారా?
దుల్కర్‌: నిజమే. కెరీర్‌ గురించి వదిలేస్తే మా నాన్నగారు ఇప్పుడు తన మనవళ్లు, మనవరాలితో ఆడుకుంటున్నారు. ఆయన చుట్టూ ఎప్పుడూ పిల్లలే ఉంటారు. అందరితో టైమ్‌ స్పెండ్‌ చేయడానికి ఇష్టపడతారు. యాక్చువల్లీ మన తల్లిదండ్రులకు గ్రాండ్‌ చిల్డ్రన్‌తో ఆడుకునే చాన్స్‌ మనం ఇవ్వాలి. లేట్‌ మ్యారేజ్‌ చేసుకుంటే గ్రాండ్‌ చిల్డ్రన్‌తో ఆడుకునే ఓపిక వాళ్లకు ఉండచ్చు, ఉండకపోవచ్చు. అసలు వాళ్లే లేకపోవచ్చు. ఆ సంగతలా ఉంచితే మీరు చెప్పిన ఫీమేల్‌ ఫ్యాన్స్‌ కూడా నన్ను ఒక్కడినే కాదు.. నా ఫ్యామిలీని ఇష్టపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా అమల్‌ (భార్య) ఎలా ఉంది? మరియమ్‌ (కూతురు) ఎలా ఉంది? అని అడుగుతారు.  


సినిమాలో రకరకాల హీరోయిన్స్‌తో యాక్ట్‌ చేస్తుంటారు. వాళ్లలో చాలా మందికి బెటర్‌ క్వాలిటీస్‌ ఉండచ్చు. అందంగా ఉంటారు. వాళ్లకు అట్రాక్ట్‌ అవ్వకుండా ఉండటానికి ఏం చేస్తారు?
దుల్కర్‌: ఈ క్వొశ్చన్‌ ఎవరూ అడగలేదు. కొంచెం ఆలోచించాల్సిందే (నవ్వుతూ). నాతో యాక్ట్‌ చేసిన నా కో–స్టార్స్‌ అందరూ నా ఫ్యామిలీకి క్లోజే. వాళ్లందరూ నా భార్యను కలిశారు. నేను ఒకటి రెండు సినిమాలు ఒక హీరోయిన్‌తో యాక్ట్‌ చేశానంటే వాళ్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ సర్కిల్‌లోకి వచ్చేస్తుంటారు. లంచ్‌ కోసం కలుస్తుంటాం. నాకు కొత్త కొత్త మనుషులను కలవడం ఇంట్రెస్ట్‌. వాళ్ల నుంచి ఏదో కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాను. మనకు వేరే ఏ ఉద్దేశం లేనప్పుడు కలసి పని చేయడానికి ఈజీగా ఉంటుంది. నా బిహేవియర్‌ని చెక్‌ చేసుకుంటాను. మనం ఎదుటి వ్యక్తిని చూసే దృష్టి కోణాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. నేను మంచి దృష్టితో చూస్తాను.

ఓ పాపకు తండ్రిగా అమ్మాయిలను ఎలా పెంచాలో చెబుతారా?
దుల్కర్‌: అబ్బాయిలను ఎంత ప్రేమగా పెంచుతామో అంతే ప్రేమగా అమ్మాయిలను పెంచాలి. ఇద్దరికీ సమానమైన స్వేచ్ఛ ఇవ్వాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను ప్రొటెక్టివ్‌ ఫాదర్‌లానే ఉంటాను. ఫస్ట్‌ నుంచి కూడా నేను అమ్మాయి పుట్టాలనే కోరుకున్నాను. మా అక్కకి ఇద్దరు అబ్బాయిలు. ఇంట్లో ఆడపిల్ల ఉండాలనుకున్నాం. నా భార్యకి సిజేరియన్‌. ఆపరేషన్‌ థియేటర్‌లో అమ్మాయి అని తెలిసింది. అప్పుడు నన్ను చూడాలి.. పింక్‌ బెలూన్‌ పట్టుకొని అల్లరి అల్లరి చేసేశాను.

సో.. మీ నాన్నగారికి ముద్దుల మనవరాలు అన్నమాట..
దుల్కర్‌: ఆయన అయితే మరియమ్‌తో ఆడుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్‌ చేస్తారు. కళ్లలో మెరుపు కనిపిస్తుంది. అసలు కంటే కొసరు ఎక్కువ అంటారు కదా.. ఒక్కోసారి నాన్నని చూస్తుంటే నాకలా అనిపిస్తుంది. మా ఫ్యామిలీకి క్వీన్‌ వచ్చింది అన్నది ఆయన ఆనందం.

మమ్ముట్టి గారిని ఎప్పుడు మీ గురించి,  మీ సినిమాల గురించి అడిగినా వేరే యాక్టర్స్‌ గురించి మాట్లాడను అంటుంటారు
దుల్కర్‌: అది మంచిదే కదా. నాకే హెల్ప్‌ అవుతుంది. అప్పుడు అందరూ నన్ను సెపరేట్‌ యాక్టర్‌గా గుర్తిస్తారు. మేమిద్దరం దాదాపు ఎక్కడా కలసి కనిపించం. మా సినిమాలను ప్రమోట్‌ చేసుకోం. దానివల్ల నా కెరీర్‌ని నా ఓన్‌గా బిల్డ్‌ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనుకుంటున్నాను. నాన్న ప్రిన్సిపల్‌ ఏంటంటే.. తన కొడుకు గురించి నలుగురూ మాట్లాడుకోవాలి. ఆయన మాట్లాడి, నలుగురితో మాట్లాడించాలనుకోరు.

మీరు బయోపిక్‌ ద్వారానే ఈ ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. మీ నాన్నగారు చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత బయోపిక్‌ (యాత్ర) ద్వారానే తెలుగులోకి రీ–ఎంట్రీ ఇవ్వడం ఎలా అనిపిస్తోంది?
దుల్కర్‌: (నవ్వుతూ)  ఇద్దరం తెలుగులో బయోపిక్‌ చేయడం అనుకోకుండా జరిగింది. నాన్నగారు చాలా ఏళ్ల తర్వాత తెలుగుకు తిరిగి వస్తున్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఆయన ఎంజాయ్‌ చేస్తున్నారు. మహీ (‘యాత్ర’ దర్శకుడు)   కూడా మంచి టెక్నీషియన్‌. నాన్నగారు యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌తో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు.   కొత్త డైరెక్టర్స్‌ నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఆయనకు ఉంది.

మమ్ముట్టిగారు ఇప్పటికీ మీ కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నారు.
దుల్కర్‌: అవును. నాన్నగారు 6–7 సినిమాలు చేస్తుంటే నేను 3–4 సినిమాలు చేస్తున్నాను. ఆయన సినిమాలు చేయడానికి అలవాటు పడిపోయారు. గత 35  ఏళ్ల నుంచి అదే చేస్తున్నారు. ఈ జనరేషన్‌లో మాకు సెలెక్టివ్‌గా చేసే లగ్జరీ ఉంది అనుకుంటున్నాను.  అది కూడా పర్సనల్‌ చాయిస్‌ అంటాను. నా కో–యాక్టర్స్‌లో సంవత్సరానికి 6–7 సినిమాలు చేసేవాళ్లు ఉన్నారు. నేనెప్పుడూ పని చేస్తూనే ఉంటాను అనుకుంటాను కానీ నాన్నగారి రిలీజ్‌లే ఎక్కువ ఉంటాయి. అదేంటో? (నవ్వుతూ).

తెలుగు, తమిళ ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళం లో పారితోషికాలు తక్కువే కదా?
దుల్కర్‌: అది నిజమే. అయితే డబ్బు కోసం నేనెప్పుడూ పరిగెత్తలేదు. నా స్కూల్‌మేట్స్‌తో కంపేర్‌ చేస్తే నేను వాళ్ల కంటే ఎక్కువ డబ్బులే సంపాదిస్తున్నట్టు లెక్క. ఆల్రెడీ నా ఏజ్‌కి ఎక్కువే పే చేస్తున్నారని అనుకుంటున్నాను. పెంచమని అడిగే ఉద్దేశం లేదు. వేరే భాషల్లో రెమ్యునరేషన్‌ ఎక్కువ ఇస్తారు కాబట్టి అక్కడి సినిమాలు చేస్తే బాగుంటుందనుకోను. నాకు స్టోరీ, క్యారెక్టర్‌ ఇంపార్టెంట్‌.

మలయాళంలో కూడా హై బడ్జెట్‌ సినిమాలు రావాలని కోరుకుంటున్నారా?
దుల్కర్‌: తప్పకుండా. అయితే వేరే భాషల్లో పెద్ద సినిమాలు సక్సెస్‌ అవుతున్నాయి అని చేయకూడదు. స్టోరీ డిమాండ్‌ చేస్తేనే చేయాలి. ‘బాహుబలి’ లాంటి సినిమాను మామూలు బడ్జెట్‌లో చేయలేం కదా. అది పెద్ద ఐడియా. చాలా ఎఫర్ట్‌తో కూడుకున్నది. అంత బడ్జెట్‌ అవసరం. అలాంటి సినిమా అయితే ఖర్చు పెట్టచ్చు.

ఫైనల్లీ.. సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు మీ నాన్నగారితో పోలుస్తారని భయపడ్డారా?
దుల్కర్‌: చాలా భయపడేవాణ్ణి. ఆ భయాన్ని అధిగమించాలనుకున్నాను. కొంచెం కొంచెంగా ఓవర్‌కమ్‌ అవుతున్నాను. ఇప్పటివరకూ చేసినవన్నీ మంచి సినిమాలే. గొప్ప గొప్ప సినిమాల్లో నటించాలన్నదే నా లక్ష్యం. డైరెక్షన్‌ చేయాలని ఉంది. అయితే ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నాను. భవిష్యత్తులో డైరెక్షన్‌ చేస్తా.


– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement