
ఇంత ఆనందాన్ని ఎప్పుడూ చవిచూడలేదు
‘‘ఇప్పటికి రెండు థియేటర్లలో ఈ చిత్రం చూశాను. ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. డాన్సులూ, ఫైట్లూ బాగా చేశావని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడు శీను’ చిత్రం ద్వారా శ్రీనివాస్ కథానాయకునిగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉందంటున్న శ్రీనివాస్‌తో జరిపిన ఇంటర్వ్యూ...
హీరో కావాలని ఎప్పుడు అనుకున్నారు?
ఏడేళ్ల క్రితం ఆ ఆలోచన వచ్చింది. నాన్నగారి ప్రోత్సాహంతో యూఎస్, వియత్నాం, ముంబయ్‌లలో యాక్టింగ్, జిమ్నాస్టిక్స్, ఫైట్స్, డాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. దాదాపు ఐదేళ్లుగా వీటిపైనే దృష్టి.
భారీ బడ్జెట్‌తో మీ నాన్న ఈ సినిమా తీశారు.. మరి టెన్షన్ పడ్డారా?
ప్రేక్షకులు మనల్ని అంగీకరిస్తారో లేదో అని టెన్షన్ పడేవాణ్ణి. నా మైండ్‌లో వందల కొద్దీ ప్రశ్నలుండేవి. బయటివాళ్లకి నాన్నగారు సీరియస్ టైప్ అనిపిస్తారేమో కానీ, మాకు తెలిసిన నాన్నగారు వేరు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. నేను టెన్షన్ పడుతుంటే... ‘దేని గురించీ ఆలోచించొద్దు. నటన మీద దృష్టి సారించు. మిగతావన్నీ నేను చూసుకుంటా’ అని భరోసా ఇచ్చారు. మా నాన్నగారంటే నాకు ప్రాణం. ఫస్ట్ కాపీ చూసినప్పుడు, నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఆయన ఎంత ఆనందపడ్డారో ఆ స్పర్శ తెలియజేసింది.
వైభవంగా మీ లాంచింగ్ జరిగినా... నిలదొక్కుకోవటం మాత్రం మీ చేతుల్లోనే ఉంది కదా?
అవునండి. బ్యాక్‌గ్రౌండ్ అనేది కొంతవరకే ఉపయోగపడుతుంది. ప్రతిభ లేకపోతే పక్కన పెట్టేస్తారు. నటుడిగా నేను నిరూపించుకోకపోతే మాత్రం నిలదొక్కుకోవడం కష్టం. అందుకే మొదటి సినిమాకే చాలా కష్టపడ్డాను. సినిమా చూసినవాళ్లందరూ ‘నీకిది మొదటి సినిమా అనిపించలేదు. బాగా చేశావ్’ అంటుంటే పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనిపించింది. నా తదుపరి సినిమాలకు ఇంకా కష్టపడతాను.
మొదటి సినిమా వినాయక్ దర్శకత్వంలో చేయడం లక్కీ అనిపించిందా?
కచ్చితంగా. వినయ్ అంకుల్ ఎప్పట్నుంచో మాకు తెలుసు. మా కుటుంబంలో ఓ వ్యక్తిలాంటివారు. పిల్లలు, పెద్దలు అందరికీ నేను దగ్గరయ్యేలా చేశారు. ఈ చిత్రాన్ని నేను పబ్లిక్ థియేటర్లో చూశాను. నేను బంగీ జంప్ చేసే సీన్ వచ్చినప్పుడు ఓ చిన్నకుర్రాడు ‘మమ్మీ ఆ అన్నయ్య పేరేంటి’ అనడిగాడు. అప్పటివరకు సెలైంట్‌గా ఉన్న ఆ బుడతడు అలా అడగ్గానే, నాకు భలే అనిపించింది. కామెడీ ట్రాక్స్ పెద్దవాళ్లు, డాన్స్, ఫైట్స్ యంగ్‌స్టర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ‘కుర్రాడు బాగున్నాడు. నటనపరంగా కూడా భేష్’ అంటున్నారు. టోటల్‌గా అందరికీ దగ్గరయ్యాను. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి.
ఐదేళ్లు డాన్సులు, ఫైట్స్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నానని చెప్పారు.. అన్నేళ్లు అవసరమా?
ఆర్ట్‌కి ఎల్లలు ఉండవండి. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది బోల్డంత ఉంటుంది. నేను అన్నేళ్లు నేర్చుకున్నాను కాబట్టే, ఇప్పటికిప్పుడు ఓ ఎమోషనల్ సీన్ చెప్పి, యాక్డ్ చేయమంటే గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడ్చేస్తాను. నవ్వే సీన్ చెబితే నవ్వేస్తాను.
పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసల గురించి?
చాలామంది నాన్నగారికి చెప్పారు. నాకు పర్సనల్‌గా అఖిల్ చెప్పాడు. మేమిద్దరం ఫ్రెండ్స్.
ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?
నా ఫేస్ మాస్ కేరక్టర్స్‌కి బాగా సూటవుతుంది కాబట్టి, అలాంటివి చేస్తాను. వ్యక్తిగతంగా హీరోయిజమ్ ఉన్న చిత్రాలను ఇష్టపడతాను. నేను చేసేవి కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను.
తదుపరి చిత్రాలు? సినిమా ఎంపిక విషయంలో మీదే తుది నిర్ణయమా?
నా జీవితంలో ఇప్పటివరకూ ఇంత ఆనందాన్ని చవిచూడలేదు. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. రెండో సినిమా గురించి ఆలోచించలేదు. సినిమాల ఎంపిక గురించి చెప్పాలంటే.. కథలు మా నాన్నగారే వింటారు. ఇంకా జడ్జ్ చేసే స్థాయి నాకు రాలేదు.