నందులో అలాంటి నటుణ్ణి చూశా
– బోయపాటి
‘‘నందు ఆల్ రౌండర్. ఏ తరహా పాత్రలోనైనా... దర్శకుడు కోరుకున్నట్లు కనిపించగలడు. నందులో అలాంటి నటుణ్ణి చూశా. ఇదొక్కటే కాదు... ముందు ముందు నందు నటించే చిత్రాలూ హిట్టవ్వాలి. వాటిలో ఈ సినిమా ముందుండాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.
నందు, సౌమ్య వేణుగోపాల్ జంటగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో ఎస్. శ్రీకాంత్‌రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మించిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. పూజ రామచంద్రన్ కీలకపాత్ర చేశారు. ఆదివారం నందు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బోయపాటి శ్రీను విడుదల చేశారు. అనంతరం నందు మాట్లాడుతూ– ‘‘బోయపాటి గారు నాకు దేవుడిచ్చిన అన్నయ్య. ‘జయ జానకి నాయక’లో మంచి పాత్ర ఇచ్చారు.
దాంతో నాకు బాగా గుర్తింపు వచ్చింది. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే, మంచి కథాంశంతో తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉండే చిత్రమిది. అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్, కెమెరా: ఎస్. మురళీమోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య.