
తాప్సీ సుందరాకాండ్
తాప్సీ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. అయితే... తెలుగుతెరపై కాదు... హిందీ తెరపై. సినిమా పేరు ‘సుందరాకాండ్’. బాలీవుడ్‌లో తాప్సీ నటిస్తున్న అయిదవ చిత్రం ఇది. ఈ మధ్యే... బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం హిందీలో ‘బేబీ’ అనే సినిమా చేస్తున్నారామె. ఇది కాకుండా మరో చిత్రంలో కూడా నటించడానికి అంగీకరించారు. ఇటీవల ఇంకో చిత్రానికి పచ్చజెండా ఊపారు.
అదే ‘సుందరాకాండ్’. బాలీవుడ్ ఛాన్స్‌ల కోసం తోటి తారలంతా ఆశగా ఎదురుచూస్తోంటే.. తాప్సీ మాత్రం జయాపజయాలకు అతీతంగా బాలీవుడ్‌లో ఇలా వరుస అవకాశాలు దక్కించుకోవడం నిజంగా విశేషమే. ఇప్పటివరకూ వచ్చిన పోలీస్ పాత్రల్లో భిన్నమైన పాత్ర ఇందులో తాప్సీ చేయబోతున్నట్లు బాలీవుడ్ టాక్. ఇప్పటిదాకా అందాన్నే ఆయుధంగా చేసుకొని యువతరాన్ని ఉర్రూతలూగించిన తాప్సీ... ‘సుందరాకాండ్’ ద్వారా అభినయ తారగా కూడా ఎదగడం ఖాయమని పలువురు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ప్రియా మిశ్రా ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇందులో ఇర్ఫాన్‌ఖాన్ కథానాయకుడు.