
‘‘మాకు సానుభూతి తెలియజేసిన స్నేహితులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో మీ అందరికీ నేను బదులివ్వలేనన్న విషయం మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నా గొంతు పెగలడం లేదు. మాటలు తడబడుతున్నాయి. త్వరలోనే అందరితో మాట్లాడతాను. మాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు! ఐ లవ్ యూ’’ అంటూ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ఉద్వేగానికి లోనయ్యాడు. విషాద సమయంలో తమకు తోడుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. కాగా బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) నిన్న ఉదయం ముంబైలో మరణించిన విషయం విదితమే. (దేశ ప్రతిష్టను పెంచిన నటుడు.. పోరాడి ఓడిపోయాడు)
గత రెండేళ్లుగా కేన్సర్‌తో పోరాడి విదేశాల్లో చికిత్స పొంది.. భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన.. పేగు సంబంధిత ఇన్ఫెక్షన్ వల్ల మంగళవారం కోకిలాబెన్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఇర్ఫాన్ బుధవారం ఉదయం మరణించాడని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఇర్ఫాన్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఇక లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేవలం 20 మంది కుటుంబ సభ్యులు, మిత్రులను మాత్రమే ఇర్ఫాన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించారు. ముంబైలోని వెర్సోవా కబ్రస్థాన్‌లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా ఇర్ఫాన్‌కు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బాబిల్, అయాన్ ఉన్నారు. (ప్రపంచ సినిమాకు తీరని లోటు..)
Comments
Please login to add a commentAdd a comment