
యుద్ధం మొదలైంది!
మీ దృష్టిలో చెడ్డదానిగా మారిన మంచి అమ్మాయి ఎవరు?... ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో సోనమ్‌కపూర్‌ని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు తడుముకోకుండా ‘దీపికా పదుకొనె’ అన్నారు సోనమ్. అది మాత్రమే కాదు.. ‘మీ దగ్గర లేనిది.. దీపికా దగ్గర ఉన్నది ఏంటి?’ అనే ప్రశ్నకు ‘అతిగా స్పందించే పీఆర్ టీమ్’ అని చటుక్కున చెప్పడంతో పాటు, మరోప్రశ్నకు సమాధానంగా ‘అసలు దీపికాకి ఓ సొంత స్టయిలే లేదు’ అన్నారు సోనమ్.
ఈ ప్రోగ్రామ్‌ని దీపికా చూడకపోయినా, చూసినవాళ్లు ఆమె చెవిలో సోనమ్ చెప్పిన సమాధానాలను ఊదేశారు. అంతే.. దీపికా పదుకొనె తన సన్నిహితుల దగ్గర సోనమ్‌ని తెగ తిట్టిపోస్తున్నారట. ఇంతకీ దీపికాపై సోనమ్‌కి ఎందుకంత ఆగ్రహం అనే విషయంలోకి వస్తే.. నిన్న మొన్నటివరకు ఈ ఇద్దరి ‘పీఆర్ ఏజెన్సీ’ ఒక్కటే. వాళ్లని మంచి చేసుకుని, సోనమ్‌ని దిగజార్చి తనని హైలైట్ చేసుకునేలా దీపికా ప్రచారం చేయించుకున్నారట.
దీపికా వదులుకున్న సినిమాలు, వాణిజ్య ప్రకటనలు సోనమ్ చేస్తోందంటూ వీలు కుదిరినప్పుడల్లా ప్రచారం చేసిందట సదరు పీఆర్ ఏజెన్సీ. ఈ విషయం గ్రహించిన సోనమ్ ఇటీవలే పీఆర్ ఏజెన్సీని మార్చేశారు. సమయం కుదిరినప్పుడు దీపికాపై సైటైర్లు వేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు కరణ్ జోహార్ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారామె.
ఇప్పటివరకు బహిరంగంగా దీపికా, సోనమ్ మాటలు అనుకున్నది లేదు. కానీ, సోనమ్ అందుకు తెరతీసేశారు. దాంతో ఇద్దరి మధ్య బహిరంగ యుద్ధం మొదలైంది. వీలు కుదిరినప్పుడల్లా ఒకరి గురించి మరొకరు నోరు పారేసుకుంటున్నారట. మరి.. ఈ యుద్ధం ఎప్పుడు సద్దుమణుగుతుందో కాలమే చెప్పాలి.