నాకది స్వీట్ షాక్!
‘‘పూరి జగన్నాథ్‌గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాతో హీరోగా పరిచయమవుతున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. పూరీగారి దర్శకత్వంలో నటించాలనేది నా డ్రీమ్. హీరోగా మొదటి సినిమాతోనే నా కల నిజమైంది. పూరీగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు’’ అన్నారు ఇషాన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ సీఆర్ మనోహర్, సీఆర్ గోపీ నిర్మించిన సినిమా ‘రోగ్’. శుక్రవారం ఈ సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఇషాన్ చెప్పిన సంగతులు....
♦ చిన్నప్పట్నుంచీ హీరో కావాలనుకోలేదు. ఒక్కసారి మనసులో ఆలోచన రాగానే మా అన్నయ్య (నిర్మాత సీఆర్ మనోహర్)కు చెప్పా. ‘హీరో కావడానికి టాల్ అండ్ హ్యాండ్సమ్‌గా ఉంటే చాలదు. చాలా హార్డ్‌వర్క్ చేయాలి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్... అన్నిటిలో శిక్షణ తీసుకోవాలి’ అన్నారు. మా తన్వీ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌లో ఏడాదిన్నర పాటు రెండు కన్నడ సినిమాలకు పని చేయించారు. తర్వాత ‘వైజాగ్’ సత్యానంద్‌గారి దగ్గరకు యాక్టింగ్‌లో ట్రైనింగ్‌కి పంపించారు. ట్రైనింగ్ పూర్తవగానే అన్నయ్య ఫోన్ చేసి... ‘నువ్వు ఇంటికి రావొద్దు. హైదరాబాద్ వచ్చేయ్. పూరీగారితో మీటింగ్ ఏర్పాటు చేశా’ అన్నారు. నాకది షాక్ అండ్ సర్‌ప్రైజ్.
♦ పది నిమిషాల మీటింగ్ తర్వాత ‘అబ్బాయి ప్రామిసింగ్‌గా ఉన్నాడు. ఇతనితో కచ్చితంగా సినిమా చేస్తా’ అన్నారు పూరీగారు. నాకది స్వీట్ షాక్. వాళ్లబ్బాయి హీరోగా పరిచయమైతే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఈ సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాంకాక్ తీసుకువెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించారు. అంత పెద్ద సూపర్‌స్టార్ దర్శకుడు అయినా... షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు కథ, ప్రతి సీన్ నాకు వివరించారు. నీకు కథ నచ్చిందా? లేదా మరో కథతో ముందుకు వెళ్దామా? అనడిగారు.
♦ పూరీగారి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్లు నాకు ఇష్టం. ‘రోగ్’లో నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. నా క్యారెక్టర్‌తో పాటు విలన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్. చాలా ఎగ్జయిటింగ్‌గా, నెర్వస్‌గా ఉంది.