హీరోను ఎంపిక చేయడం కరెక్టేనా..?
న్యూఢిల్లీ: కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఎంపిక వివాదంపై బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ ను గుడ్ విల్ అంబాసిడర్ గా ఎందుకు ఎంపిక చేశారని మిల్కా సింగ్ అనలేదని చెప్పాడు. ఆటగాడికి ఆ ఉన్నత పదవి కట్టబెడితే బాగుండేదని ఫర్హాన్ అభిప్రాయపడ్డాడు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) రియో ఒలింపిక్స్ కు గానూ భారత్ తరఫున గుడ్ విల్ అంబాసిడర్ గా గత శనివారం సల్మాన్ ను ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఈ విషయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు, ఆటగాళ్లు ఈ విషయంపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే లెజండరీ అథ్లెట్ మిల్కా సింగ్ కేవలం అభిప్రాయాన్ని వెల్లడించగా వివాదాస్పదమైందని ఫర్హాన్ వివరించాడు. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లు ఉండగా, బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయడంపై మాత్రమే మిల్కా తన అసహనాన్ని వ్యక్తం చేశారని వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నాడు. మిల్కా సింగ్ జీవిత కథాంశంతో రూపొందిన 'బాగ్ మిల్కా బాగ్' మూవీలో ఫర్హాన్ అక్తర్ మిల్కా సింగ్ గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మిల్కా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగా ఫర్హాన్ స్పందించాడు. సల్మాన్ తండ్రి ప్రముఖ రచయిత సలీంఖాన్, మిల్కా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ కారణం చేతనే మిల్కా వ్యాఖ్యలు తప్పుగా ప్రచారం అవుతున్నాయని ఆందోళన చెందాడు. అయితే తాను సల్మాన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, కేవలం గుడ్ విల్ అంబాసిడర్ అంశంపై మాత్రమే స్పందించానని చెప్పాడు.