ఆ క్షణాలను గుర్తు చేసుకుని ఆనందపడిపోతా!
జీవితంలో ఎప్పుడు తల్చుకున్నా అప్పటికప్పుడు హాయిగా నవ్వుకుని, ఆనందపడదగ్గ సంఘటనలు బోల్డన్ని ఉంటాయి. ఇలాంటి తీపి గుర్తులు శ్రుతీహాసన్‌కు చాలా ఉన్నాయట. ఎప్పుడైనా అవి గుర్తొస్తే, పులకరించిపోతానని అంటున్నారామె. ఇంతకీ ఆ మధురమైన జ్ఞాపకాలు ఏంటంటే... చిన్నప్పుడు స్టేజి మీద తొలిసారి డ్యాన్స్ చేసిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని శ్రుతీహాసన్ చెబుతూ -‘‘అంత చిన్న వయసులోనే మనం ధైర్యంగా స్టేజి మీద పెర్ఫార్మ్ చేశాం కదా.
ఇప్పుడెందుకు చేయలేం? అని పెద్దయ్యాక అనిపించింది. సో.. నా తొలి పెర్ఫార్మెన్స్ నాకు ఆనందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందనే చెప్పాలి. నా చెల్లెలు అక్షరకూ, నాకూ మధ్య దాదాపు నాలుగైదేళ్లు వయసు వ్యత్యాసం ఉంది. అక్షర పుట్టినప్పుడు నాకు భలే ఆనందం అనిపించింది. ఆ డేట్‌ని ఎప్పుడు తల్చుకున్నా బుల్లి చేతులు, కాళ్లు, వేళ్లు గుర్తొస్తాయి. ‘హీరోయిన్‌గా ఎంటర్ అవుదాం. ఇక జీవితాంతం ఆర్టిస్ట్‌గా కొనసాగుదాం’ అని నిర్ణయించుకున్న క్షణాలు నాకెప్పటికీ తీపి గుర్తుగా మిగిలిపోతాయి.
ఖాళీ సమయాల్లో రాసుకున్న చిన్ని చిన్ని కవితల్లో కొన్ని గుర్తొస్తుంటాయి. ఎక్కడైనా రుచికరమైన తినుబండారాలు లాగిస్తుంటాను కదా. ఆ టేస్ట్ గుర్తొచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఒకే టేక్‌లో ఓకే అయిపోతాయ్. వాటిలో మనసుకి హత్తుకున్న సీన్స్ అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. ఇలా నేను తల్చుకుని ఆనందపడటానికి బోల్డన్ని సంఘటనలు ఉన్నాయి’’ అన్నారు.